Ongole CM Convoy Incident : అర్ధరాత్రి నడిరోడ్డుపై వదిలేశారు, ఇలా మరొకరికి జరగకూడదు : ఒంగోలు ఘటన బాధితుల తీవ్ర ఆవేదన
Ongole CM Convoy Incident : సీఎం కాన్వాయ్ కోసం ఓ కుటుంబాన్ని అర్ధరాత్రి నడిరోడ్డుపై దింపేశారు ఆర్టీవో అధికారులు. ఈ ఘటనపై బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Ongole CM Convoy Incident : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తోన్న భక్తులపై ఒంగోలు ఆర్టీవో అధికారుల ఓవరాక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన శ్రీనివాసుల కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనార్ధం బుధవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన ఇన్నోవా వాహనాన్ని బుక్ చేసుకుని తిరుమలకు బయలుదేరారు. రాత్రి పది గంటల సమయంలో ఒంగోలు చేరుకున్న వారు టిఫిన్ కోసం వాహనాన్ని ఆపారు. అదే సమయంలో ఆర్టీవో కార్యాలయానికి చెందిన ఓ కానిస్టేబుల్ కారుతో పాటుగా డ్రైవర్ ను తీసుకెళ్లాడు. మరికొద్ది సేపటి తరువాత తిరిగి వచ్చిన కానిస్టేబుల్ కారులో నుంచి లగేజీ తీసుకోవాలని శ్రీనివాసులుకు చెప్పారు.
సీఎం పర్యటన నేపథ్యంలో ట్రైయల్ రన్ కు ఇన్నోవా వాహనం అవసరం ఉందని చెప్పి నడి రోడ్డుపై ఓ కుటుంబాన్ని దించేసి కారు తీసుకెళ్లారు. ఆ సమయంలో మరొక వాహనం దొరక్క శ్రీనివాసుల కుటుంబం మహిళలు, పిల్లలతో పాటుగా సమీపంలోని బస్టాండ్ లో నిరీక్షించాల్సి వచ్చింది. మరొక వాహనాన్ని బుక్ చేసుకుని తిరుమలకు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంగోలు ఆర్టీవో అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రజలను నడి రోడ్డుపై దింపిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ సీఎంవో అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఒంగోలు ఆర్టీవో అధికారుల వ్యవహారశైలితో తాము అర్ధరాత్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందని, దీనిపై స్పందించిన సీఎం అధికారులపై చర్యలు చేపట్టడం ద్వారా మరోకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందని బాధితులు అంటున్నారు..
అధికారులే ఇలా చేస్తే ఎలా?
"ఒంగోలులో రాత్రి పది గంటల సమయంలో టిఫెన్ చేసేందుకు ఆగాం. ఆర్టీవో కానిస్టేబుల్ వచ్చి వెహికల్ తీసుకెళ్లారు. పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చి లగేజీ తీసుకోవాలన్నారు. ఎందుకని అడిగితే సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ కోసం వెహికల్ ఉంచుకుంటున్నామన్నారు. ఏదైనా వాహనం ప్రొవైడ్ చేయాలని కోరాం. ఏం చేయలేం అని కానిస్టేబుల్ అన్నారు. రాత్రి పది గంటలకు చిన్న పిల్లలతో నడిరోడ్డుపై ఉండిపోయాం. తిరిగి వినుకొండకు ఫోన్ చేసి మరో వాహనాన్ని బుక్ చేసుకున్నాం. అధికారులే ఇలా చేస్తే ఎలా?" శ్రీనివాసులు, బాధితుడు
ఈ నష్టాన్ని ఎవరు బాధ్యత వహిస్తారు
"రాత్రి నడిరోడ్డుపై పిల్లలతో ఇబ్బంది పడ్డాం. ఆడవాళ్లలను ఇలా రాత్రి నడిరోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఇంకో వాహనాన్ని బుక్ చేసుకుని ఊరి చివరికి రమ్మని అక్కడ ఎక్కాం. మళ్లీ ఆ వాహనాన్ని ఎవరు తీసుకుంటారో అనే భయంతో వెళ్లాం. ఇది సీఎం వరకు వెళ్లదు. వెళ్లనివ్వరు. సీఎం గారు ఇలాంటి వారిటి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మేము మధ్యతరగతి వాళ్లమే. మరొకరి కింద పనిచేస్తున్న వాళ్లం. ఇప్పుడు రెండు వాహనాలు బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ నష్టం ఎవరు భరిస్తారో తెలియదు" బాధితురాలు