Challa Familu Disupte : మళ్లీ రోడ్డున పడి కొట్టుకున్న చల్లా కుటుంబం - అవుకులో ఉద్రిక్తత !
చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు మరోసారి రోడ్డున పడి కొట్టుకున్నారు. అవుకులో ఉద్రిక్తత ఏర్పడింది.
Challa Familu Disupte : నంద్యాల జిల్లా అవుకులోని చల్లా నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చల్లా కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. అవుకు మండల జడ్పిటిసి సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మి, ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డి, వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. జడ్పిటిసి సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మికి సంబంధించిన ఫోన్ పర్సనల్ డేటాను బయటకు తీసి తనను అవమానాలకు గురి చేశారని మీడియా ముందు వాపోతూ చల్లా శ్రీలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. మహిళలకు సరైన రక్షణ లేదంటూ చల్లా శ్రీలక్ష్మి వాపోయారు.
కొంత కాలంగా చల్లా కుటుంబంలో గొడవలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభావితమైన రాజకీయ కుటుంబాల్లో ఒకటిగా ఉన్న చల్లా ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు వీధిన పడ్డాయి. చల్లా రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కుమారుడు కూడా ఇటీవల చనిపోయారు. దాంతో ఆ కుటుంబంలో వారసత్వ సమస్యలు వచ్చాయి. చల్లా రామకృష్ణారెడ్డి రెండో కుమారుడు చల్లా భగీరథరెడ్డి మరణం తర్వాత రాజకీయ ఆధిపత్యం కోసం చల్లా కుటుంబ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. చల్లా పెద్ద కుమారుడు విఘ్నేశ్వర్ రెడ్డి, రెండో కుమారుడు భగీరథరెడ్డి భార్య శ్రీలక్ష్మి చల్లా ఇంటి సమీపంలోనే ఎదురెదురుగా పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు.
రెండు వైసీపీ ఆఫీసులు ప్రారంభించి రాజకీయాలు
ఒకే కుటుంబానికి చెందిన చల్లా శ్రీలక్ష్మి.. విగ్నేశ్వర్ రెడ్డిలు రెండు వర్గాలుగా విడి పోవడం, గొడవలకు దిగడం తీవ్ర చర్చనీయాంశ మైంది. చల్లా సీమ పాలిటిక్స్‌లో ఓ వెలుగు వెలిగారు. ఎమ్మెల్సీ పదవిలో ఉండగా చల్లా రామకృష్ణారెడ్డి 2021 జనవరిలోఅనారోగ్యంతో మృతి చెందారు. అనంతరం సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవిని చల్లా రామకృష్ణారెడ్డి చిన్న కుమారుడు చల్లా భగీరథరెడ్డికి కట్టబెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కూడా 2022 నవంబర్‌లో ఆకస్మికంగా మరణించారు. నాటి నుంచి చల్లా కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. చల్లా భగీరథరెడ్డి సతీమణి, అవుకు జెడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మి ఒక వర్గంగా.. చల్లా రామకృష్ణారెడ్డి భార్య శ్రీదేవి , పెద్ద కుమారుడు విగ్నేశ్వర్ రెడ్డి , చల్లా సోదరులు కలిసి మరో వర్గంగా విడిపోయారు. చల్లా వారసత్వం విషయంలో రెండు వర్గాల మధ్య ఆరు నెలల నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చల్లా కుటుంబం నుంచి రెండు వర్గాల వారు టికెట్ ఆశించారు. అయితే సీఎం జగన్ ఆ టికెట్ మరొకరికి ఇవ్వడంతో చల్లా కుటుంబానికి నిరాశ ఎదురయింది. ఈ క్రమంలోనే చల్లా శ్రీలక్ష్మి ఇంటికెదురుగా పార్టీ కార్యాలయాన్ని ఇటీవలే ప్రారంభించారు. మరోవైపు.. చల్లా విగ్నేశ్వర రెడ్డి కూడా పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. ఆ సందర్భంలోనే చల్లా రాజకీయ వారసుడు విగ్నేశ్వర రెడ్డి అని చల్లా రామకృష్ణారెడ్డి భార్య శ్రీదేవి.. కుటుంబ సభ్యులు ప్రకటించారు. అయితే తానే వారసులరాలినని చల్లా శ్రీలక్ష్మి భ ావిస్తున్నారు. చల్లా శ్రీలక్ష్మి సీఎం జగన్ వద్దకు వెళ్లి తన గోడు వెళ్ళబోసుకున్నారు. చల్లా శ్రీలక్ష్మికి భద్రతగా 3 + 3 గన్‌మెన్‌లను ప్రభుత్వం కేటాయించింది.
చల్లా ఉన్నప్పుడు అందరూ సైలెంట్
చల్లా రామకృష్ణారెడ్డి రాజకీయ స్టైలే వేరు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన వన్‌మ్యాన్ ఆర్మీగా.. ఫ్యాక్షన్ లీడర్‌గా సాగారు. ఆయన బతికున్నంత కాలం చల్లా కుటుంబంలో చిన్నపాటి గొడవ కూడా జరగలేదు. కానీ చల్లా రామకృష్ణారెడ్డి మరణాంతరం కుటుంబంలోని వారే రెండు వర్గాలుగా విడిపోయారు.