Chandrababu Arrest: సీఎం జగన్ కక్షపూరిత రాజకీయాలతో అన్యాయంగా చంద్రబాబుకు శిక్ష - టీడీపీ
Chandrababu Arrest: జగన్ కక్షపూరిత రాజకీయాల కారణంగానే చంద్రబాబు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నారని తెలుగుదేశం పార్టీ మండిపడింది.
Chandrababu Arrest: ఏపీ సీఎం వైఎస్ జగన్ కక్షపూరిత రాజకీయాల కారణంగానే చంద్రబాబు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నారని తెలుగుదేశం పార్టీ మండిపడింది. స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు చట్టాన్ని పాటించలేదని ఆ పార్టీ ఆరోపించింది. అవినీతి నిరోధక చట్టం 2018 సవరణ ప్రకారం, మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి ముందు రాష్ట్ర గవర్నర్ నుంచి సీఐడీ అనుమతి పొందాలని, కానీ సీఐడీ వాటిని అమలు చేయకుండానే చంద్రబాబును అరెస్ట్ చేసిందని పేర్కొంది.
చంద్రబాబు నాయుడుపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ విమర్శించింది. సీఐడీ సెక్షన్ 17ఏ ప్రయోగించిందని, చట్టం నిర్దేశించిన విధివిధానాలను పాటించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని మండిపడింది. అవినీతి నిరోధక చట్ట సవరణ తర్వాత అంటే 2018 తర్వాత దర్యాప్తు లేదా కేసు నమోదైతే, గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరని పేర్కొంది. అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారి, ఉన్నతాధికారులు పబ్లిక్ సర్వెంట్లను విచారించకూడదని తెలిపింది.
అవినీతి నిరోధక చట్ట సవరణకు ముందు, 2018కి ముందే విచారణ ప్రారంభమైందని జగన్ ప్రభుత్వం చెబుతోందని, కానీ ప్రభుత్వ వాదన ప్రకారం 2018కి ముందే దర్యాప్తు ప్రారంభమైనట్లు ఎలాంటి రుజువు లేదని టీడీపీ ఆరోపించింది. ఒకవేళ ఉంటే ప్రభుత్వ తరఫు న్యాయవాది తప్పనిసరిగా ఆయా పత్రాలను కోర్టుకు సమర్పించాలని, కానీ అలాంటివి ఏవీ సమర్పించలేదంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేనందున, విచారణను మరింత జాప్యం చేసేందుకు కోర్టు అడిగిన పత్రాలను సమర్పించడానికి అదనపు సమయాన్ని కోరుతోందని విమర్శించింది. దీని వెనక ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించింది.
చంద్రబాబు నాయుడుని జైలులోనే నిర్బంధించాలనే ఉద్దేశ్యంతో కోర్టు ఆదేశించిన పత్రాలను సమర్పించేందుకు సమయం కోరడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోందని టీడీపీ ఆరోపించింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఎలా నరకయాతన పెడుతోంది అనడానికి ఇదే నిదర్శనమని, కేవలం ఆరోపణల ఆధారంగా పలుమార్లు అరెస్టులు చేసి టీడీపీ నేతలను సుదీర్ఘ కాలంగా జైలులో ఉంచేందుకు చూస్తోందని మండిపడింది. ఇలా చేయడం ద్వారా ఎన్నికల ముందు టీడీపీ నాయకత్వాన్ని దెబ్బకొట్టాలనే వ్యూహంతో జగన్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని ధ్వజమెత్తింది.
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 9కి వాయిదా
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను మళ్లీ సోమవారానికి (అక్టోబరు 9) వాయిదా పడింది. ఈ సందర్భంగా హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోపు తమకు కూడా సమర్పించాలని సీఐడీ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఇటీవల ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
నేడు (అక్టోబరు 3) సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు, సిద్ధార్థ లుథ్రా, హరీశ్ సాల్వే, అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేశారని లాయర్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని.. ఈ కేసులో ఆ సెక్షన్ వర్తిస్తుందా? లేదా? అన్నదే ప్రధానమని అన్నారు. ఆరోపణలు ఎప్పుడు వచ్చాయనేది కాదని.. కేసు నమోదు, విచారణ ఎప్పుడు అనేది చర్చించాలని హరీశ్ సాల్వే వాదించారు.