Breaking News: సీఎం ఎక్కడుంటే అదే రాజధాని : మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 31న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
ఏపీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 1 నుంచి కడప జిల్లాలో పర్యటన చేయనుంది. సెప్టెంబరు ఒకటి సాయంత్రం 4.20 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వేంపల్లె మండలంలోని ఇడుపులపాయకు వెళ్తారు. 4.50గంటల నుంచి 5.50 గంటల వరకు పార్టీ నాయకులతో భేటీ అవుతారు. 6.00 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్‌లోని అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బసచేస్తారు. సెప్టెంబరు 2న ఉదయం వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అక్కడ కార్యక్రమాలను ముగించుకుని తర్వాత తాడేపల్లికి తిరిగి వెళ్తారు.
ఆరోగ్యం మళ్లీ విషమించడంతో విదేశాలకు విజయ్ కాంత్ !
తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ ఆరోగ్యం మెరుగుపడలేదు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అమెరికా, సింగపూర్‌లలో చికిత్స చేయించుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన సినిమాలకు దూరమయ్యారు. పార్టీ బాధ్యతలను తన భార్యకు అప్పగించారు. సెకెండ్ వేవ్ లో ఆయనకు కరోనా సోకింది. కొవిడ్ నుంచి కోలుకున్నా ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తరచుగా వైద్య పరీక్షలకు వెళ్తున్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పెద్దగా పాల్గొనలేకపోయారు. తాజాగా ఆరోగ్యం మళ్లీ విషమించడంతో ఆయన విదేశాలకు వెళ్తున్నట్లు తెలిసింది . చెన్నై విమానాశ్రయంలో వీల్‌చైర్‌పై ఆయన వెళ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
40 అంతస్థుల భవంతులను కూల్చివేయండి : సుప్రీంకోర్టు
ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రెండు భారీ భవనాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సూపర్‌టెక్ ఎమరాల్డ్ సంస్థ 40 అంతస్తులతో 2 టవర్లు నిర్మించింది. నిబంధనలకు విరుద్ధంగా వీటని నిర్మించారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం జంట టవర్లను కూల్చివేయాలని ఆదేశించింది. మూడునెలల్లోపు కూల్చివేతలు పూర్తిచేయాలని అధికారులకు తెలిపింది. కూల్చివేతకు అయ్యే ఖర్చును సూపర్‌టెక్ సంస్థ నుంచే వసూలు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు టవర్లలో దాదాపుగా వెయ్యి ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్లు కొన్న వారందరికీ 12 శాతం వడ్డీతో నగదు తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
సీఎం ఎక్కడుంటే అదే రాజధాని : మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
సీఎం జగన్ ఎక్కడుంటే అదే రాజధాని అని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఉన్న చోటే రాజధాని అనుకోవాలని అన్నారు. పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చు, రేపు మరో ప్రాంతం కావచ్చు అన్నారు. సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటేరియెట్, అదే రాజధాని అని స్పష్టం గౌతంరెడ్డి తెలిపారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనికి అంతా కట్టుబడి ఉన్నామని తెలిపారు. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
కూన రవికుమార్ పై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి టీడీపీ శాసనసభపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కి హాజరు కాలేదు. కమిటీ ముందు హాజరవ్వాలని వీరిద్దరికీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీచేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ సమావేశానికి హాజరు కాలేనని అచ్చెన్నాయుడు ప్రివిలేజ్ కమిటీకి సమాచారం పంపారు.
కూన రవికుమార్ మాత్రం ప్రివిలేజ్ కమిటీకి ఎలాంటి సమాచారం పంపలేదని తెలుస్తోంది. దీంతో ప్రివిలేజ్ కమిటీ కూన రవికుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 14వ తేదీన ప్రివిలేజ్ కమిటీ మరొసారి సమావేశం అవుతుంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో ప్రివిలేజ్ కమిటీ వీరిద్దరికీ నోటీసులు పంపింది.
వరదలో చిక్కుకున్న బస్సు కొట్టుకుపోయింది..
వరద నీటిలో చిక్కుకున్న టీఎస్ ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట వద్ద చోటుచేసుకుంది. నిన్న వరద ఎక్కువగా ఉండటంతో గంభీరావుపేట శివారు మానేరు వాగు లోలెవల్ బ్రిడ్జి వద్ద బస్సు నీటిలో చిక్కుకుంది. బస్సులో ఉన్న ప్రయాణికులను స్థానికులు కాపాడారు. తర్వాత బ్రిడ్జిపై చిక్కుకున్న బస్సును జేసీబీ సాయంతో బయటకు తెచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. వరద ప్రవాహం అలాగే కొనసాగడంతో ఈరోజు బస్సు కొట్టుకుపోయింది. ఈ బస్సు.. మానేరు వాగు మధ్యలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బస్సును ఈరోజు వెలికి తీసే అవకాశం ఉంది.