VijayaSai Reddy: ఈడీ, సీబీఐ వేర్వేరు.. ఒకేసారి విచారణ కుదరదు.. విజయసాయిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు..
అక్రమాస్తుల వ్యవహారాల కేసు విచారణకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి సహా పలువురు దాఖలు చేసిన 8 పిటిషన్లను కోర్టు కొట్టిసింది.
అక్రమాస్తుల వ్యవహారాల కేసు విచారణకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చుక్కెదురైంది. ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసుల తర్వాతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులపై విచారణ చేపట్టాలన్న వాదనలపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండానే ఈడీ కేసులపై విచారణ చేపట్టవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి సహా పలువురు దాఖలు చేసిన 8 పిటిషన్లను కోర్టు కొట్టిసింది. జస్టిస్ షమీమ్ అక్తర్ మంగళవారం ఈ మేరకు వెలువరించారు.
జనవరి 11న కోర్టు ఉత్తర్వులు..
అక్రమాస్తుల కేసుకు సంబంధించి జనవరి 11న సీబీఐ/ఈడీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులపై విచారణ చేపట్టవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, భారతి సిమెంట్స్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ కేసుల తర్వాత కానీ, లేదంటే కలిపి విచారణ చేపట్టేలా ఆదేశాలివ్వాలంటూ కోర్టును కోరారు.
ఒకే సారి విచారణ జరపాలి..
ఈ కేసుకు సంబంధించి పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈడీ కేసుకు ఆధారమైన సీబీఐ కేసును కొట్టేస్తే ఈడీ కేసు విచారణ చేపట్టడం వల్ల ప్రయోజనం ఉండదని తెలిపారు. సీబీఐ కేసు తర్వాత, లేదంటే ఒకే సారి విచారణ చేపట్టవచ్చని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఝార్ఖండ్, కేరళ, కర్ణాటక హైకోర్టులు స్పష్టత ఇచ్చాయని ఉదహరించారు.
ఈడీ స్వతంత్రమైనది...
ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈడీ చట్టంలోని సెక్షన్ 44కు వివరణ ఇస్తూ 2019లో చట్ట సవరణ వచ్చిందని పేర్కొన్నారు. దీని ప్రకారం చూసుకుంటే ప్రధాన కేసు (క్రిమినల్)తో సంబంధం లేకుండా ఈడీ కేసుపై విచారణ చేపట్టవచ్చని తెలిపారు. ఒకవేళ క్రిమినల్ కేసును కొట్టేసినా, మరే రకమైన ఉత్తర్వులు జారీచేసినా ఈడీ కేసులో విచారణను కొనసాగించవచ్చని వివరించారు. ఈడీ అనేది స్వతంత్రమైనదని.. మరో కేసుతో సంబంధం లేదని స్పష్టం చేశారు. పిటిషనర్లు తమకు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్న తీర్పులు సవరణకు ముందు వచ్చాయన్న గుర్తు చేశారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈడీ వాదనలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. సీబీఐ, ఈడీ కేసులు వేర్వేరని, సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులపై ముందుగానే విచారణ చేపట్టవచ్చని పేర్కొన్నారు. పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తీర్పు వెలువరించారు.
కౌంటర్లు దాఖలు చేయండి..
బెయిలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌లో కౌంటర్లు దాఖలు చేయాలని సీబీఐ కోర్టు విజయసాయిరెడ్డి, సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి బెయిలును రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదన్ రావు విచారణ చేపట్టారు. కృష్ణరాజు తరఫు న్యాయవాది వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి.. కౌంటర్లు దాఖలు చేయాలని విజయసాయిరెడ్డి, సీబీఐను ఆదేశించారు. తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేశారు.