Ys Viveka Case : అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో రిలీఫ్ - సోమవారం వరకూ అరెస్ట్ వద్దని సీబీఐకి ఆదేశం !
వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
Ys Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అలాగే కేసు పూర్తి వివరాల ఫైల్‌ను తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించంది. కేసు విచారణలో భాగంగా సేకరించిన ఆడియో, వీడియో గ్రీఫీలను హార్డ్ డిస్క్ రూపంలో తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. అయితే మంగళవారం అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి తరపు లాయర్ ఈ హత్య కేసులో సీబీఐ ఏకపక్షంగా విచారణ జరుపుతోందని వాదిచారు.
రెండు దఫాలుగా అవినాష్ రెడ్డి నుంచి తీసుకున్న స్టేట్మెంట్‌ను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టుకు ఆయన తరుపు న్యాయవాది తెలిపారు. జనవరి 28, ఫిబ్రవరి 24వ తారీఖున చేసిన విచారణ స్టేట్‌మెంట్లపై తమకు అనుమానాలు ఉన్నాయని అవినాష్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని అవినాష్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామన్నారు. ఈ రోజు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిందన్నారు. గత రెండుసార్లు జరిపిన విచారణ స్టేట్‌మెంట్స్‌ను పక్కన పెట్టాలని అవినాష్ న్యాయవాది కోరారు. రెండుసార్లు సీబీఐ జరిపిన విచారణ ఆడియో వీడియో రికార్డింగ్ లేకుండా ఉందన్నారు. రెండుసార్లు విచారణ ముగిసిన అనంతరం అవినాష్ రెడ్డి నుంచి సంతకాలు తీసుకోలేదన్నారు.
40 నుంచి 50 సార్లు అవినాష్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను సీబీఐ ఎస్పీ రాంసింగ్ ఎడిట్ చేశారన్నారు. అవినాష్ రెడ్డి సంతకం లేనందున స్టేట్‌మెంట్లు మార్చి ఉండొచ్చని అవినాష్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వివేకా హత్య కేసులో అసలు నేరస్థుడు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డినే అని పేర్కొన్నారు. అవినాష్ ను విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని అవినాష్ తరుపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అందుకే ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు. సీబీఐ విచారణ కు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఇప్పటి వరకు సహకరించామని.. ఇక ముందు కూడా సహకరిస్తామని అవినాష్ రెడ్డి తరుపు లాయర్ కోర్టుకు వెల్లడించారు. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్‌లో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు.
మరో వైపు అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్‌లో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. తనపై వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసినందున తమ వాదనలు వినాలని కోర్టును ఆభ్యర్థించారు. మరో వైపు ఈ కేసు విచారణ కోసం సీబీఐ ఆఫీసుకు ఉదయమే అవినాష్ రెడ్డి హాజరయ్యారు. మూడో సారి విచారణకు హాజరు కావడంతో అరెస్ట్ చేస్తారేమోనన్న ఉద్దేశంతో పులివెందుల నుంచి పెద్ద ఎత్తున అవినాష్ రెడ్డి అనుచరులు తరలి వచ్చారు. హైకోర్టు లో విచారణ జరుగుతున్న సమయంలో సీబీఐ కార్యాలయం వద్ద వారి హంగామా ఎక్కువగా ఉంది. కోర్టు రిలీఫ్ ఇవ్వడంతో సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు లేవు.