Paritala Sriram: టీడీపీ కమ్మల పార్టీ కాదు కేతిరెడ్డి, మీరు ముందు ఈ విషయాలు తెలుసుకోండి: పరిటాల శ్రీరామ్
TDP News: అధికార పార్టీ వైసీపీ నాయకులు ధర్మవరంలో చేసింది సామాజిక సాధికార బస్సు యాత్ర కాదని, జగన్ భజన యాత్ర అని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు.
YSRCP MLA Kethireddy: అధికార పార్టీ వైసీపీ నాయకులు ధర్మవరంలో చేసింది సామాజిక సాధికార బస్సు యాత్ర కాదని, జగన్ భజన యాత్ర అని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం టీడీపీ ఆఫీసులో పరిటా శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ బస్సుయాత్రతో పాటు ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యల మీద ఘాటుగా స్పందించారు. బస్సు యాత్రలో పాల్గొన్నవారు తమకు ఇన్ని పదవులు ఇచ్చారు.. అన్ని ఇచ్చారని జగన్ భజన చేశారు తప్ప.. వారంతా వారి కులానికి ఏం మంచి చేశారో ఒక్క ముక్క కూడా చెప్పలేదన్నారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పదవులు ఇచ్చినందుకు వైసీపీ నేతలే బాధపడుతున్నారని చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో కులాల వారిగా కార్పొరేషన్లకు రుణాలు, పని ముట్లు ఇతర సాయం అందించి వారు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదం చేశారన్నారు. కానీ మీకున్న పదవులు కేవలం నేమ్ బోర్డులు వేసుకునేందుకు మాత్రమే పరిమితం అన్నారు.
వాస్తవాలు మాట్లాడు కేతిరెడ్డి..!
బస్సు యాత్ర సందర్భంగా కేతిరెడ్డి సామాజిక న్యాయం లాంటి గొప్ప గొప్ప వ్యాఖ్యలు చేశారని.. కానీ మన ధర్మవరం నియోజకవర్గంలో ఏ కులానికి ఏం న్యాయం చేశావని కేతిరెడ్డిని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను హింసిస్తూ.. వారి ఆశలు, ఆస్తుల కూల్చివేతల మీద నీ అక్రమ ఆస్తులు సంపాదించుకున్నావని ఆరోపించారు. మీ నాయకులు ఎస్టీల బోర్లు పూడిస్తే ఏ రోజైనా స్పందించావా అని నిలదీశారు. బీసీలు, వైశ్యులు ఇళ్లు కూల్చినప్పుడు కానీ.. వారి భూములు అక్రమంగా కాజేసినప్పుడు నువ్వెందుకు స్పందించలేదన్నారు. తాడిమర్రిలో ఇళ్లు కూల్చినప్పుడు, ముదిగుబ్బలో ముస్లింల స్మశాన వాటికను కబ్జా చేసినప్పుడు, అలాగే బీసీల భూములను ఆక్రమించుకున్నప్పుడు ఎక్కుడున్నావని ప్రశ్నించారు.
ధర్మవరం పట్టణంలో బీసీలను బెదిరించి నువ్వు ఆర్థికంగా స్థిరపడింది నిజం కాదా అని నిలదీశారు. మాంగళ్య షోరూం లాంటి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మారి.. ధర్మవరంలో చేనేతలకు పండుగ రోజు వ్యాపారాలు లేకుండా చేసిన ఘనత నీదేనన్నారు. ఇందుకోసం చేనేతలు నీ దగ్గరకు వస్తే ఏం మాట్లాడావో గుర్చు చేసుకోవాలన్నారు. గతంలో సుమారు 14వేల మంది చేనేతలకు అందే సబ్సిడీ.. ఇప్పుడు నాలుగైదు వేల మందికి మాత్రమే ఎందుకొస్తోందో చెప్పాలన్నారు. ప్రతి రోజు గుడ్ మార్నింగ్ అని ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సోషియల్ మీడియాలో వైరల్ చేసుకునే నువ్వు.. వాటి మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల మీద పెట్టి ఉంటే ఎప్పుడో పరిష్కారం అయ్యేవన్నారు. ఏ కాలనీలో చూసినా డ్రైనేజీ, రోడ్ల సమస్యలు చెబుతున్నారని.. నువ్వు మరి రోజు ఎందుకు తిరుగుతున్నావని నిలదీశారు. మరోవైపు మా నమ్మకం నువ్వే జగన్ అని అంటించే స్టిక్కర్ల డబ్బుతో రోడ్ల సమస్య తీర్చవచ్చన్నారు.
కులాల మధ్య చిచ్చు పెట్టవద్దు.. టీడీపీ బీసీల పార్టీ
ధర్మవరంలో శ్రీరామ్ గెలిస్తే.. రెడ్లను ఒక్కర్నీ కూడా ఉండనివ్వరని నీ అనుచరుల చేత ప్రచారం చేయిస్తున్నావని.. ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. అన్ని కులాల కోసం పోరాడిన కుటుంబం, ప్రాంతం నుంచి తాను వచ్చానని మాకు రెడ్లు ఎప్పుడూ శత్రువులు కాదన్నారు. రెడ్ల గురించి ఇంత ప్రేమ ఒలకబోస్తున్న కేతిరెడ్డి అండ్ కో... ఇదే రెడ్ల మీద దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తుమ్మలలో ఆర్మీ జవాన్ పై దాడి జరిగినప్పుడు, జనసేన నేత రాజారెడ్డిపై దాడి జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. తాము అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటామని.. మా వాళ్లను ఇబ్బంది పెట్టే వారిపై మాత్రం కచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని శ్రీరామ్ హెచ్చరించారు.
కాగా, టీడీపీ కేవలం కమ్మల పార్టీ అని.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత కమ్మలు మాత్రమే నిరసనలు తెలిపారని కేతిరెడ్డి వ్యాఖ్యానించడంపై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత రాష్ట్రంతో పాటు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ అన్ని వర్గాలు నిరసనలు తెలియజేశారని తెలిపారు. ఒక్క ధర్మవరంలోనే టీడీపీ నిరసనల్లో పాల్గొన్న వారి మీద మీరు పెట్టించిన కేసులను చూడాలన్నారు. ఈ కేసుల్లో ఇరుక్కున్న వారిలో అన్ని కులాల వారు ముఖ్యంగా బీసీలు, రెడ్లు కూడా ఉన్నారన్నారు. ఇప్పటికైనా ఏదో వివేకానందుని తరహాలో ఫోజులు ఇవ్వడం మానేసి ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టాలని హితవు పలికారు.