Nara lokesh on cyclone rehabilitation: జగన్ ప్రభుత్వం ఫెయిలైంది, తుపాను సహాయంపై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు
Nara Lokesh News In Telugu: తుపానుపై ప్రజల్ని అప్రమత్తం చేయడంలోనూ, సహాయకచర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం విఫలమైందని అన్నారు లోకేష్.
Cyclone Michaung News Updates: తుపాను సాయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందని మండిపడ్డారు నారా లోకేష్. తుపాను తీవ్రతపై వారం ముందునుంచీ కేంద్ర విపత్తు సంస్థలు హెచ్చరికలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్ష చేపట్టలేదని అన్నారు లోకేష్. తుపానుపై ప్రజల్ని అప్రమత్తం చేయడంలోనూ, సహాయకచర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం విఫలమైందని, దాని ఫలితంగా ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వరద ప్రాంతాల్లో గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు లోకేష్. రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా, టీడీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా మానవతాదృక్పథంలో సహాయం చేసే తెలుగుదేశం పార్టీ శ్రేణులు తుపాను సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఓ వైపు వర్షం-మరోవైపు తీవ్రమైన గాలులు ఉన్న నేపథ్యంలో అన్నిజాగ్రత్తలు తీసుకుని తుపాను బాధితులకు ఆహారం, ఇతరత్రా సాయం అందించాలని టీడీపీ కేడర్ కి సూచించారు.
ఆపద కాలం...ఆపన్న హస్తం
ఆపదకాలంలో ప్రజలకు ఆపన్న హస్తం అందించాలని సూచించారు నారా లోకేష్. టీడీపీ ఎప్పుడూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడుతుందన్నారు. గతంలో తుపానులు వచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టిందని, బాధితులను ఆదుకుందని, పునరావాస కార్యక్రమాలను కూడా వేగంగా చేపట్టిందన్నారు లోకేష్. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు లోకేష్. తుపానుపై ముందస్తుగానే హెచ్చరికలు ఉన్నా కూడా ప్రజల్ని అప్రమత్తం చేయలేదని, తీరా తుపానుతో గ్రామాలు నీటమునిగి ప్రజలు అవస్థలు పడుతుంటే.. హడావిడిగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని, ప్రజలు ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారని చెప్పారు.
తుపాను వల్ల నారా లోకేష్ యువగళం కూడా తాత్కాలికంగా వాయిదా పడింది. తుపాను తర్వాత ఆయన యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. తిరిగి యాత్ర ప్రారంభమైన తర్వాత తుపాను ప్రభావిత ప్రాంతాలను కూడా ఆయన సందర్శిస్తారు. బాధితులతో నేరుగా మాట్లాడతారు. అటు టీడీపీ నేతలు కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో దెబ్బతిన్న పంటలను టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పరిశీలించారు. బాధితులతో ఆయన మాట్లాడారు. జోరువానలో కూడా ఆయన బాధితుల దగ్గరకు వెళ్లి వారిని పరామర్శించారు. వర్షంలో తడుస్తున్న ధాన్యాన్ని రైతులు కాపాడుకోడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు రామానాయుడు. పలువురు రైతులు ఆయన వద్ద తమ ఆవేదన వెలిబుచ్చారు. చేతికి అందిన పంట నోటి దగ్గరకు రాకుండా పోయిందని, తాము తీవ్రంగా నష్టపోయామని చెప్పారు రైతులు. తుపాను హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు రామానాయుడు. అందుకే భారీ స్థాయిలో ఇప్పుడు పంట నష్టం జరిగిందని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే నిమ్మల డిమాండ్ చేశారు.
మరోవైపు తుపాను తీరం దాటడంతో ఇప్పుడిప్పుడే కోస్తా జిల్లాల్లో పరిస్థితి అదుపులోకి వస్తోంది. వర్షం తగ్గి, గాలుల ప్రభావం కూడా తగ్గుతోంది. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అక్కడే ఆహారం అందిస్తున్నారు. పూర్తిగా తుపాను ప్రభావం తగ్గిన తర్వాతే పునరావాస శిబిరాలు ఖాళీ చేయిస్తారని తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు పునరావాస శిబిరాల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం జగన్ కూడా ఇప్పటికే తుపాను పరిహారాన్ని ప్రకటించారు. పునరావాస శిబిరాల్లో ఉన్నవారికి నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందించి ఇంటికి పంపించాలని చెప్పారు. ఇల్లు కోల్పోయిన వారికి 10వేల రూపాయలు పరిహారం అందించాలన్నారు. అయితే ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వం తుపాను సాయంలో విఫలమైంది అని విమర్శించడం విశేషం.