TDP Janasena BJP Meeting: సీట్ల కేటాయింపుపై చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ
Andhra Elections 2024: టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నేతలు సీట్ల సర్దుబాటుపై ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కీలకంగా భేటీ అయి చర్చిస్తున్నారు. ఈ
Chandrababu arrives at his residence in Undavalli: అమరావతి: ఎన్నికల బరిలోకి దిగేందుకు ఏర్పాటైన కూటమి నేతలు సీట్ల సర్దుబాటు, కేటాయింపులపై భేటీ అయ్యారు. టీడీపీ, బీజేపీ, జనసేన (Janasena) ముఖ్య నేతలు సీట్ల సర్దుబాటుపై ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసంలో కీలకంగా భేటీ అయి చర్చిస్తున్నారు. ఈ భేటీకి టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్, పార్టీ జాతీయ నేత బైజయంత్ పండా హాజరయ్యారు. వీరితో పాటు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ ఈ భేటీకి హాజరు కాలేదని సమాచారం.
పొత్తులో భాగంగా టీడీపీ 145 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాల్లో బరిలోకి దిగనుంది. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు కేటాయించారు. వీటిలో జనసేన 6 అసెంబ్లీ సీట్ల అభ్యర్థులను జనసేన పార్టీ ప్రకటించింది. బీజేపీ 6 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. అయితే ఏ సీట్లు కేటాయిస్తారు, అక్కడ పోటీ చేసే అభ్యర్థులపై తేల్చేందుకు కూటమి నేతలు చంద్రబాబు నివాసంలో భేటీ అయి చర్చిస్తున్నారు.
రెండున్నర గంటలుగా చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల సమావేశం కొనసాగుతోంది. పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలపై సందిగ్ధత వీడలేదు. ముఖ్యంగా మదనపల్లె, శ్రీకాళహస్తి, కదిరి, పి.గన్నవరం స్థానాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశం జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు నివాసానికి సీఎం రమేష్ వచ్చారు. ఆయన విశాఖ ఎంపీ సీటు ఆశిస్తున్నారని పార్టీలో వినిపిస్తోంది.
ఢిల్లీ పర్యటనతో కూటమిపై క్లారిటీ
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతవారం ఢిల్లీలో పర్యటించారు. బీజేపీ పెద్దలతో, కేంద్ర మంత్రి అమిత్ షాతో ఇరువురు నేతలు భేటీ అయిన తరువాత పొత్తులపై స్పష్టత ఇచ్చారు. టీడీపీ, జనసేన పార్టీలో ఎన్డీఏలోకి వచ్చాయని.. ఏపీలో ఈ పార్టీలతో కలిసి బీజేపీ పనిచేయనుందని పార్టీ అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొనడం తెలిసిందే.
రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ పొత్తులు
టీడీపీ, జనసేనతో పొత్తు ఖరారు కావడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆదివారం నాడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుష్టపాలనకు చరమగీతం పాడాలంటే వైసీపీని ఓడించడం ఒక్కటమే మార్గమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ మేనిఫెస్టో రథాలను ఆదివారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మేనిఫెస్టో తయారీలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాష్ట్రం కోసం ఒకటి, కేంద్రం నుంచి ఏం ఆశిస్తున్నారని రెండు బాక్సులతో బీజేపీ ప్రచార రథాలు పంపిస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు బీజేపీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.