Chandrababu: విజయవాడ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు - ష్యూరిటీల సమర్పణ, కార్యకర్తల నినాదాలతో గందరగోళం
Andhra News: టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఐఆర్ఆర్, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో అధికారులకు ష్యూరిటీ, బాండ్స్ సమర్పించారు.
Chandrababu Submitted Surities in Vijayawada CID Office: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) శనివారం విజయవాడ (Vijayawada) సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం నేరుగా ఏపీ సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR), మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు హైకోర్డు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. వారంలోపు రూ.లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చెయ్యొద్దని సూచించింది. ఈ క్రమంలో చంద్రబాబు ఉచిత ఇసుక కేసులో సీఐడీ కార్యాలయానికి వెళ్లి అధికారులు పూచీకత్తు, బాండ్ సమర్పించారు. అనంతరం ఐఆర్ఆర్ (IRR Case) కేసులో కుంచనపల్లి, మద్యం కేసులోనూ గుంటూరు సీఐడీ కార్యాలయాలకు వెళ్లి బాండ్లు సమర్పించేందుకు వెళ్లారు.
సీఐడీ కార్యాలయం వద్ద గందరగోళం
చంద్రబాబు రాకతో విజయవాడ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ప్రభుత్వం ఆయనపై తప్పుడు కేసులు పెట్టిందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు బారికేడ్లు అడ్డం పెట్టి టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బారికేడ్లు తోసుకుంటూ లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దారు. పెనుమలూరు సీటును పార్థసారథికి ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో బోడె ప్రసాద్ అభిమానులు చంద్రబాబు ఎదుట నిరసన తెలిపారు. సీఐడీ కార్యాలయం వద్ద ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.
3 కేసుల్లోనూ బెయిల్
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత.. మరికొన్ని కేసులు తెరపైకి వచ్చాయి.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం కేసు, ఇసుక కేసు.. ఇలా పలు కేసుల్లో సీఐడీ వరుసగా కేసులు నమోదు చేసింది. ఈ 3 కేసుల్లోనూ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మొదట మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబుకు ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. మిగిలిన కేసుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఈ నెల 10న తీర్పు వెలువరించింది. 3 కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆయనకు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది.
16న కీలక తీర్పు
మరోవైపు, స్కిల్ డెలవప్‌మెంట్ కేసులో తనపై చట్ట విరుద్ధంగా కేసు నమోదు చేశారని తనకు 17ఏ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు ఈ నెల 16న (మంగళవారం) ఇవ్వనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ తీర్పును వెలువరించనుంది. గతంలో విచారణ పూర్తైన తర్వాత అక్టోబర్ 20వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. సుదీర్ఘ కాలంగా రిజర్వులో ఉన్న తీర్పును సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇవ్వనుంది. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.