Supreme Court To AP : కేంద్ర నిధుల మళ్లింపు కుదరదు - ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
కేంద్ర నిధుల దారి మళ్లింపుపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీ చట్టాన్ని ఉల్లంఘించిందని కేంద్రం కూడా సుప్రీంకోర్టుకు తెలిపింది .
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర నిధుల మళ్లింపుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా జగన్ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిధులను పీడీ ఖాతాలకు మళ్లింపుపై బుధవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏపీ సర్కారు తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదంటూ కోర్టుకు తెలిపింది.నిధుల దారి మళ్లింపుపై కేంద్ర ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఏపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఎస్టీఆర్ఎప్ నిధులను దారి మళ్లించడం కుదరదని స్పష్టం చేసింది. ఈ మేరకు నిధులు మళ్లిస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. గతంలో ఇదే కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ బాధితులకు నష్టపరిహారంలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏపీలో ముగ్గురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది.
విపత్తులు సంభవించినప్పుడు నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన రూ. వెయ్యి కోట్లను సీఎం జగన్ మళ్లించినట్లుగా కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్‌లో కూడా ప్రకటించింది. . ఈ మొత్తాన్ని ఇన్‌పుట్ సబ్సిడీ పేరుతో పంపిణీ చేశారని.. వాస్తవంగా రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర నిధులు మళ్లించిందో లేదో చెప్పాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ఇందులో చాలా నిధులు మళ్లించినట్లుగా కేంద్రమమంత్రి చెప్పారు.
ఏపీకి కేంద్రం రాష్ట్ర విపత్తు నిధికి కేంద్ర వాటా కింద రూ.324.15 కోట్లు... జాతీయ విపత్తు నిధి కింద రూ.570.91 కోట్లు ఇచ్చింది. అయితే ఈ నిధులన్నీ మళ్లించినట్లుగా తెలిపారు. రూ.1,100 కోట్ల విపత్తు నిధులను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఖాతాకు మళ్లించారు. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఆ నిధులను మళ్లించారని కేంద్రం తెలిపింది. ఈ వ్యవహారం విపత్తు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మళ్లింపు సాధ్యం కాదని చెప్పడంతో మల్లీ ఆ నిధులు జమ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.