AP Chit Fund Raids : మార్గదర్శి సహా చిట్ ఫండ్ సంస్థల్లో సోదాలు - అక్రమంగా డిపాజిట్లు తీసుకుంటున్నారన్న ఏపీ అధికారులు !
ఏపీలో మార్గదర్శి సహా చిట్ ఫండ్ ఆఫీసుల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు సోదాలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేస్తున్నారు.
AP Chit Fund Raids : ఆంధ్రప్రదేశ్‌లో చిట్ ఫండ్ కంపెనీల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చిట్స్ పేరుతో సేకరిస్తున్న సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించుకుంటున్నారని.. దానితో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. సోదాలు జరుపుతున్న సంస్థల్లో మార్గదర్శి, శ్రీరామ్, కపిల్ చిట్స్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన లావాదేవీలను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అవకతవకలు జరిగితే కేసులు పెట్టే అవకాశం ఉంది.
మార్గదర్శి డిపాజిట్ల అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ మీడియా దిగ్గజం అయిన రామోజీరావు కుటుంబానికి చెందిన సంస్థ. ఈ సంస్థ విషయంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక రకాల ఆరోపణలు చేస్తోంది., రిజర్వు బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణలపై గతంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో రామోజీ రావుపై ఉన్న నేరాభియోగాలను కొట్టి వేస్తూ 2018 డిసెంబరు 31న ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనిని సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఏపీ ప్రభుత్వం తాము కూడా ఇంప్లీడ్ అవుతామని పిటిషన్ దాఖలు చేసింది. రామోజీ రావుపై నేరాభియోగాలను హైకోర్టు కొట్టివేయడం సరికాదని ప్రభుత్వం వాదిస్తోంది.
ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్‌లో ఇంప్లీడ్ అయిన ఏపీ ప్రభుత్వం
మార్గదర్శి చిట్ ఫండ్ ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అదే వాదనను సుప్రీంకోర్టులో వినిపించింది. మార్గదర్శి కేసులో రామోజీరావు కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అన్ని పిటిషన్లపై తదుపరి విచారణను డిసెంబరు రెండో తేదీన జరగనుంది. ఈ లోపే ఏపీలోని మార్గదర్శి ఆఫీసుల్లో సోదాలు నిర్వహించడం రాజకీయంగానూ చర్చనీయాంశమయ్యే అవకాశాలు ఉన్నాయి. సీఎం జగన్ తన రాజకీయ ప్రత్యర్థుల్లో రామోజీరావును కూడా చేర్చి చెబుతూంటారు. దుష్టచతుష్టయంలో ఆయన కూడా ఒకరని ఆరోపిస్తూ ఉంటారు.
బోర్డు తిప్పేస్తున్న పలువురు అనధికార చిట్ వ్యాపారులు
అయితే చిట్ ఫండ్ వ్యాపారం.. ఇంకా పూర్తి స్థాయిలో వ్యవస్థీకృతం కాలేదు. మార్గదర్శి, శ్రీరామ్ చిట్స్, కపిల్ చిట్స్ లాంటి కొన్ని సంస్థలు మాత్రమే భారీగా వ్యాపారం చేస్తున్నాయి. మిగతా సంస్థలు మార్కెట్లో పెద్దగా నిలబడలేదు. అయితే వ్యక్తిగతంగా చిట్స్ వ్యాపారం చేసే వారు ప్రతీ చోటా ఉంటారు. ఇలాంటి వారు తరచూ ఐపీ పెడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలా అనధికారికంగా చిట్స్ వేయడం చట్టబద్ధం కాకపోయినప్పటికీ.. ఏమీ చేయలేకపోతున్నారు. నిర్వాహకులు ఐపీ పెట్టినప్పుడు వారి ప్రయోజనాలను కాపాడలేకపోతున్నారు. బడా సంస్థలు కూడా చిట్స్ మెజ్యూర్ అయిన తర్వాత అధిక వడ్డీ ఆశ చూపి తమ వద్దే డిపాజిట్ చేయించుకుటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తాజా సోదాల్లో లెక్కలు బయటపడే అవకాశం ఉంది.