Srikakulam Bear Attack : వజ్రపుకొత్తూరు పరిసర ప్రాంతాల్లో హై అలెర్ట్, ఒంటరిగా బయటకు వెళ్లొద్దు- మంత్రి సీదిరి అప్పలరాజు
Srikakulam Bear Attack : శ్రీకాకుళం జిల్లా ఎలుగుబంటి హల్ చల్ చేస్తుంది. ఇవాళ ఎలుగుదాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను పరామర్శించిన మంత్రి సీదిరి అప్పలరాజు, వజ్రపుకొత్తూరు ప్రాంత ప్రజలు హైఅలెర్ట్ గా ఉండాలని సూచించారు.
Srikakulam Bear Attack : శ్రీకాకుళం జిల్లా ఎలుగుబంటి దడ పుట్టిస్తోంది. నిన్న ఎలుగుదాడిలో ఓ రైతు మృతి చెందగా, ఇవాళ ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. అలాగే వజ్రపుకొత్తూరు పరిసర ప్రాంత ప్రజలు హై అలెర్ట్ గా ఉండాలని మంత్రి డా.సీదిరి అప్పలరాజు సూచించారు. పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు, కిడిసింగి గ్రామాలలో ప్రజలపై ఎలుగుబంటి దాడి ఘటనపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎలుగుబంటి దాడితో నిన్న ఒకరు మృతి, ఇవాళ ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని మంత్రి తెలిపారు. క్షతగాత్రలను శ్రీకాకుళం మెడీకవర్ ఆసుపత్రికి తరలించారు. ఫారెస్ట్, పోలీస్, రెవిన్యూ అధికారులతో మాట్లాడిన మంత్రి వారికి ఆదేశాలు ఇచ్చారు. ఎలుగుబంటి దాడులను నియంత్రించాలని అధికారులకు ఆదేశించారు. వజ్రపుకొత్తూరు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలుగుబంటిని పట్టుకునేంతవరకు ఎవరూ ఒంటరిగా బయట తిరగవద్దని విజ్ఞప్తి చేశారు.
బాధితులకు మంత్రి పరామర్శ
శ్రీకాకుళంలోని మెడీకవర్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యశాకాధికారి, జిల్లా ఫారెస్ట్ అధికారి, రెవెన్యూ అధికారి, వైద్యులు ఇతర అధికారులతో కలిసి మంత్రి సీదిరి అప్పలరాజు క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. క్షతగాత్రుల వైద్యానికి అవసరమైన పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరణించిన వ్యక్తి కుటుంబానికి తక్షణ సాయం కింద 2.5 లక్షలు రూపాయలు చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మరొక 2.5 లక్షలు రూపాయలు కలిసి మొత్తంగా ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయలు పరిహారం రైతు కుటుంబానికి చెల్లిస్తామని అన్నారు. బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామని మంత్రి డాక్టర్ సీదిరి తెలిపారు .
వజ్రపుకొత్తూరులో మరోసారి ఎలుగు బంటి దాడి
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుల ఎలుగు బంటి ఇవాళ మరోసారి దాడి చేసింది. ఎలుగు దాడిలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా, చికిత్స అందించేందుకు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎలుగు బంటి దాడులు వరుసగా జరుగుతున్నా అటవీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం పొలం పనులకు వెళ్లాలన్నా, ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా భయంగా ఉందని చెబుతున్నారు. ఎలుగుబంటి ఎక్కడ తమపై దాడి చేస్తుందోనన్న భయమే వారిని ఏ పని చేయకుండా చేస్తుందని వాపోతున్నారు.
ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మృతి
వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామంలో ఆదివారం ఉదయం ఎలుగుబంటి చేసిన దాడిలో కలమట కోదండ రావు(50) అనే అన్నతాద మృతి చెందాడు. ప్రతిరోజూ లాగే ఉదయం నిద్ర లేచిన కోదండ రావు గ్రామ సమీపంలో ఉన్న తోటకు వెళ్తుండగా సమీప పొదల్లో దాగివున్న ఎలుగుబంటి ఒక్కసారిగా ఆయనపై దాడి చేసింది. ఎలుగు దాడితో ప్రాణ భయంతో ఆయన గట్టిగా కేకలు వేశారు. దగ్గర్లో ఉన్నవారు అక్కడికి వచ్చేసరికి ఎలుగు అక్కడ నుండి పారిపోయింది. ఎలుగు దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.