Snow Fog In AP: స్వర్గాన్ని తలపిస్తున్న విశాఖ మన్యం అందాలు, మంచు దుప్పట్లో కోనసీమ!
Snow Fog In AP: ఉదయం పది దాటినా మన్యం, కోనసీమ ప్రాంతాల్లో సూరీడు మాత్రం దోబూచులాడుతున్నాడు. మంచు దుప్పటి కప్పుకొని బయటకు రావాల వద్దా అన్నట్లు తొంగి చూస్తున్నాడు.
Snow Fog In AP: విశాఖ మన్యం అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. అందులోనూ శీతాకాలం మొదలవుతూనే అక్కడ ఏర్పడే ప్రకృతి దృశ్యాలను చూడడం ఒక లైఫ్ టైమ్ ఎక్స్ పీరియన్స్ అంటుంటారు టూరిస్టులు. సహజంగా పచ్చని పైర్లతో కళకళలాడే కోనసీమ ప్రాంతం అంతా మంచు దుప్పటి కప్పుకుంది. లేలేత సూర్య కిరణాలు మంచు తెరలను చీల్చుకుంటూ వస్తున్న దృశ్యాలు పర్యాటకుల మదిని పలకింపజేస్తున్నాయి. ఉదయాన్నే అకాశానికేసి చూసిన వారి మనసుకు ఆహ్లాదాన్ని కల్గిస్తున్నాయి. ముఖ్యంగా అరకు, పాడేరు సమీపంలోని వంజంగి కొండల వద్ద ఉదయాన్నే ఏర్పడే తెల్లటి మబ్బుల సముదాయాన్ని చూడడానికి రెండు కళ్ళూ చాలవు. ఎముకలు కొరికే చలిలో కూడా పర్యాటకులు ప్రకృతి అందాలను కళ్లారా చూసేందుకు తహతహలాడుతున్నారు. సాధారణంగా డిసెంబర్ మొదటి వారంలో ఏర్పడాల్సిన ఈ మబ్బుల.. నెల ముందుగానే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్లే వాతావరణం చల్లబడి నవంబర్ మొదటి వారంలోనే ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తున్నాయి.
ఇక మన్యంలోని కొండల మీద ఏర్పడే మంచు తెరలను చూడడానికి ఒక జన్మ సరిపోదని అక్కడికి వెళ్లి వచ్చిన ప్రజల చెబుతున్నారు. ఈ అందాలను చూడడానికి తెల్లవారుజామున 5 గంటలకే వంజంగి చేరుకుంటున్నారు టూరిస్టులు. కొండల పైన నిలబడి చూస్తుంటే.. చేతికందే తెల్లటి దుప్పటి లాంటి మేఘాలు, మంచు తెరలను చీల్చుకుంటూ వచ్చే సూర్యుడి కిరణాలు విశాఖ మన్యాన్ని భూతల స్వర్గంలా మార్చేస్తున్నాయి. మరెందుకు ఆలస్యం.. మీరూ ఈ వింటర్ లో వైజాగ్ మన్యం లోని వంజంగి కి ఓ రౌండ్ వేసేయ్యండి.
10 దాటినా చిమ్మ చీకట్లే.. ఆకాశమంతా మబ్బులే
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామ పరిసర ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. మైదాన ప్రాంతమంతా మన్యాన్ని తలపిస్తుంది. తెల్లవారు జామున 9 గంటల వరకూ మంచు దుప్పటి వీడలేదు. బీమ్ లైట్ల వెలుగులో వాహనాల రాకపోకలు సాగాయి. మండలంలో పలు గ్రామాల్లో పొగ మంచు భారీగా పడింది. ఉదయం 10 గంటల అయినా సరే చల్లని గాలులు వీస్తున్నాయి. తెల్లవారు జామున 5 గంటల నుండి దట్టమైన పొగ మంచు కురుస్తూ తొమిది గంటలు అయినా సరే మంచు తగ్గడం లేదు. మంచు అందాలను ప్రకతి ప్రేమికులు ఆస్వాదిస్తున్నారు. మండలంలో తదితర ప్రాంతాల్లో మంచు అందాలు కనువిందు చేశాయి.
మరోవైపు వాహన దారులకు రోడ్డు కనిపించక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేసుకునేందుకు వెళ్లే వాళ్లు, బడికి, ఆఫీసులకు వెళ్లే వాళ్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ స్వెటర్లు వేస్కొని మరీ తమ పనులు చేసుకుంటున్నారు. కొందరు పొగ మంచును ఎంజాయ్ చేస్తుండగా.. మరికొందరేమో ఇదేంట్రా బాబోయ్ అంటూ తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇంత పొద్దెక్కుతున్నా ఈ చలేంటని, పొగ మంచేటని విసుక్కుంటున్నారు.