Andhra Pradesh News: నేటి నుంచి ఏపీలో రెండో విడత ఆరోగ్య సురక్ష శిబిరాలు- 6 నెలల నిర్వాహణకు చర్యలు
Andhra Pradesh News: గ్రామాల్లో మంగళవారం, శుక్రవారం ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహిస్తారు. పట్టణాలు, నగరాల్లో బుధవారం శిబిరం ఏర్పాటు చేస్తారు.
Andhra Pradesh News: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సురక్ష(Jagananna Arogya Suraksha) కార్యక్రమం నేటి నుంచి రెండో విడత ప్రారంభం కానుంది. గ్రామాల్లో నేటి నుంచి ప్రారంభమైతే... పట్టణాలు, నగరాల్లో రేపటి(బుధవారం) నుంచి స్టార్ట్ అవ్వనుంది. వారానికి రెండు రోజుల పాటు ఈ ఆరోగ్య సురక్ష శిబిరాలను ఏర్పాటు చేస్తారు. ఇలా ఆరు నెలల పాటు దాదాపు 14 వేల శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.
మొదటి దశలో 60 లక్షల మందికి సేవలు
గ్రామాల్లో మంగళవారం, శుక్రవారం ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహిస్తారు. పట్టణాలు, నగరాల్లో బుధవారం, గురువారం శిబిరం ఏర్పాటు చేస్తారు. తొలి దశను సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో యాభై రోజుల పాటు నిర్వహించారు. 60 లక్షల మందికి సేవలు అందించినట్టు చెప్పుకుంటున్న ప్రభుత్వం.
రెండో దశ ఆరు నెలలు
రెండో దశ ఆరు నెలల పాటు నిర్వహించి 13,954 శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది ప్రభుత్వం. గ్రామాల్లో 10,032 శిబిరాలు, పట్టణాలు, నగరాల్లో 3,922 శిబిరాలు ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా జనవరి వ్యాప్తంగా 3,583 శిబిరాలు నిర్వహించనుంది.
శిబిరాల్లో స్పెషలిస్టు వైద్యులు
శిబిరాల ఏర్పాటుకు ముందు వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి అక్కడ ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఆరోగ్య సురక్ష శిబిరంలో అందే వైద్య సేవలు వివరిస్తారు. అక్కడకు వచ్చే వైద్యుల వివరాలను కూడా తెలియజేస్తారు. ప్రతి శిబిరంలో ఒక మెడికల్ ఆఫీసర్‌తోపాటు ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఉంటారు. వీరితోపాటు. 543 జనరల్ మెడిసిన్ వైద్యులు, 645 గైనకాలజిస్ట్, 349 జనరల్ సర్జన్, 345 ఆర్థోపెడిక్స్, 378 మంది ఇతర స్పెషలిస్టు వైద్యులు శిబిరాల్లో సేవలు అందించనున్నారు. కంటి సమస్యలు తెలుసుకునేందుకు 562 మంది పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది.
ఆరోగ్య శ్రీ ఆసుపత్రులకు తరలింపు
శిబిరాల్లో వచ్చిన ప్రజలకు ఉన్న వ్యాధులు గుర్తించేందుకు ఏడు రకాల కిట్లు సిద్దం చేసింది ప్రభుత్వం. వీటితోపాటు రోగులకు ఇచ్చేందుకు గ్రామాల్లో 92 రకాల మందులు, పట్టణాలు, నగరాల్లో 152 రకాల మందులు ఉంచుతోంది. ఇక్కడ గుర్తించిన వ్యాధులను బట్టి రోగులను ఆయా ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు.
Also Read: మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ఏపీ ప్రభుత్వం
Also Read: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న చలి! ఈ ప్రాంతాల్లో మరీ ఎక్కువ: ఐఎండీ