YS Jagan Eluru Tour: 16న ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన - వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదలకు అంతా రెడీ
YS Jagan Eluru Tour: ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం (మే 16న) ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
AP CM YS Jagan Mohan Reddy to visit Eluru District On 16 May: కరోనా వ్యాప్తి తగ్గిన అనంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ వేగం పెంచారు. అందులోనూ గతంలో చెప్పినట్లుగా ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పాటు చేశారు. మరోవైపు గడప గడపకూ వైఎస్సార్ తో పార్టీ నేతలను ప్రజల మధ్య బిజీ బిజీగా గడిపేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం (మే 16న) ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏలూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా..
కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఒకటైన ఏలూరు జిల్లా గణపవరం మండలం గణపవరంలో వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే గత మూడేళ్లుగా వైఎస్సార్ రైతు భరోసా నగదు సాయాన్ని రైతులకు అందిస్తోండగా... మే 16న నాలుగో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సోమవారం ఉదయం 10.10 గంటలకు సీఎం జగన్ ఏలూరు జిల్లా గణపవరం చేరుకోనున్నారు. అక్కడ నుంచి గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఒక్క బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో రూ.5,500 జమ చేస్తారు. ఈ నెలాఖరులో మరో రూ.2000 రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
బహిరంగ సభ..
రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ చేసిన అనంతరం డిగ్రీ కాలేజీ మైదానంలో జరగనున్న బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు ఏపీ సీఎం. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లి చేరుకోనున్నారు.
ఇటీవల మత్స్యకార భరోసా..
కోనసీమ జిల్లా ఐ.పోలవరం మం. మురమళ్లలో మత్స్యకార భరోసా కార్యక్రమం ప్రారంభించారు సీఎం జగన్. 1,08,755 మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ.108.75 కోట్ల పంపిణీ చేశారు. 23,458 మంది మత్స్యకారులకు సమ్మిళిత అభివృద్ధి జీవనోపాధికి ఓఎన్జీసీ ద్వారా రూ.107.90 కోట్లు పంపిణీ జరిగింది. తాజాగా వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు.
మే 17న కర్నూలు జిల్లాకు సీఎం జగన్..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 17న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి జరాక గ్రామం గుమ్మటం తండాలో పర్యటించనున్నారు. సుమారు 15వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 5,410 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్‌కో ఎనర్జీస్ లిమిటెడ్ ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read: YSR Rythu Bharosa 2022: ఏపీ రైతులకు శుభవార్త, వైఎస్సార్ రైతు భరోసా నగదు రూ.5,500 జమ అయ్యేది ఎప్పుడంటే !
Also Read: CM Jagan Tour: 17న కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన- విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన