Israel : యుద్ధ వాతావరణం ఉన్నా ఇజ్రాయెల్ వెళ్లడానికి జనం ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? కారణం తెలిస్తే షాక్ అవుతారు!
Israel: ఇజ్రాయెల్‌లో మొన్నటి వరకు యుద్ధ వాతావరణం ఉంది. పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో కూడా తెలియదు. కానీ చాలా మంది గోదావరి జిల్లా వాసులు అక్కడు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Israel: పశ్చిమప్రాచ్యంలో ఉన్న అన్ని దేశాల్లోనూ ఇజ్రాయెల్ కూడా ఒక చిన్నదేశం. ఇక్కడి జనాభా కేవలం 95 లక్షలు మాత్రమే.. అంటే తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్నంత జనాభా. స్టార్ట్ ఆఫ్ నేషన్‌గా పిలిచే ఇజ్రాయెల్‌లో ప్రపంచంలోనే హై టెక్నాలజీ రంగంలో అగ్రస్థానంలో ఉంటుంది. ఫార్మలోనూ డైమండ్ల ఎగుమతుల్లోనూ అగ్రస్థానమే. ఇక ఏసుక్రీస్తు జన్మించిన జెరూసలేం. రాజధాని టెల్ అవీవ్, డెడ్‌సీ (మృత్య సాగరం), ఎలియట్ వంటి పర్యాటక ప్రాంతాలు మరో ఆదాయం. ఇలా అంతా బాగానే ఉన్నా చుట్టూ శుత్రుదేశాలు ఎక్కువగా ఉండడంతోపాటు పలు ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ దేశంతో శత్రుత్వం ఉండడంతో ఇక్కడ యుద్ధ వాతావరణం అనివార్యం.
గత కొన్ని రోజులుగా ఇరాన్‌తో జరిగిన యుద్ధంతో టెల్ అవీవ్‌తోపాటు పలు పట్టణాలులోని బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో అక్కడ భయానక వాతావరణం కనిపించింది. అయినప్పటికీ మన దేశంలో ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎక్కువ మంది ఉపాధి నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లేందుకు ఎందుకు ఇష్టపడుతుంటారు..? అక్కడకు వెళ్లి సంవత్సరాలు తరబడి ఉపాధి పొందుతూ ఇక్కడ కోటిశ్వరులు అయినవారు ఉన్నారు. అయినా ఇజ్రాయెల్ వెళ్లాలంటే ఆసక్తిని కనపరుస్తుండడం, లక్షల రూపాయలు ఏజెంట్లుకు ఇచ్చి ఇజ్రాయెల్ వీసా పొంది అక్కడికి వెళ్లడం కనిపిస్తుంది..
కరెన్సీ మారక విలువలో భారీ వ్యత్యాసమే అసలు కారణమా..
ఇజ్రాయెల్‌లో తరచూ యుద్ధాలు జరుగుతుంటాయని, అక్కడ అణువణువునా ప్రమాదం పొంచి ఉంటుందని తెలిసినా చాలా మంది ఇజ్రాయెల్ వెళ్లి ఉపాధి పొందేందుకు ఎక్కువ ప్రయత్నిస్తూనే ఉంటుంటారు. దీనికి అసలు కారణం అక్కడ కరెన్సీ భారత కరెన్సీ కంటే మారక విలువ 24 రెట్లు ఎక్కువ. ఇజ్రాయెల్ దేశపు అధికారిక కరెన్సీ ఇజ్రాయిలీ న్యూ షెకెల్ దీనినే ఐఎల్‌ఎస్ అని పిలుస్తుంటారు. ఇది మన దేశంలో 100 పైసలు ఎలానో అక్కడ 100 అగోరోట్‌గా చెబుతారు. ప్రస్తుతం మారక విలువ చూసుకుంటే ఒక షెకెల్ (ఐఎల్‌ఎస్) ఇండియన్ రూపీలోకి మారిస్తే రూ.25 కంటే ఎక్కువ లభిస్తుంది. ఇది సగటున ఒక షెకెల్ రూ.24.5 గా అంచనా వేయవచ్చు అని చెబుతుంటారు. ఉదాహరణకు అక్కడ ఉపాధి కోసం వెళ్లిన వారికి 5000 షెకెల్(ఐఎల్‌ఎస్) జీతంగా లభిస్తే ఇక్కడ మన దేశపు కరెన్సీలో అది కాస్తా రూ.1.20 లక్షలు వరకు వస్తుంది. అదే పదివేలు షెకెల్ జీతం అయితే రూ.2.40 లక్షలు జీతం వస్తుంది.. అందుకే ఇజ్రాయెల్‌లో ఎంతటి ప్రమాదకర పరిస్థితి ఉన్నా అక్కడ ఉపాధి పొందేందుకు చాలా మంది ప్రయత్నిస్తునే ఉంటుంటారు.
ఒక్క కోనసీమ నుంచే అక్కడ 1500 మంది..
ఇజ్రాయెల్‌లో ఉపాధి పొందుతున్నవారిలో ఒక్క అంబేడ్కర్ కోనసీమ ప్రాంతం నుంచే అధికారికంగా 1500 మందిపైబడి ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల ఇరాన్‌కు ఇజ్రాయేల్‌కు మధ్య జరిగిన యుద్ధం కారణంగా ఇక్కడ అధికార యంత్రాంగం ఈ జాబితాను సిద్ధం చేసింది. అంతటి భీకర యుద్ధ వాతావరణ పరిస్థితులున్నా చాలా మంది స్వదేశం వచ్చేందుకు ఆసక్తిని కనపరచలేదని అధికారులకు తెలిపారని చెబుతున్నారు. కష్టమైనా నష్టమైనా ఇజ్రాయెల్‌లోనే ఉంటూ పని చేసుకుంటామని తెలిపినట్లు కొందరు అధికారులు తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు నియోజకవర్గంలో అత్యధికంగా ఇజ్రాయెల్‌లో ఉపాధి పొందుతున్నట్లు నిర్ధారించారు. ఇందులో సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు మండలాల పరిధిలో ఎక్కువ మంది మహిళలే ఇజ్రాయేల్‌లో ఉపాధి పొందుతుండగా ఇటీవల కాలంలో వ్యవసాయ, హార్టీ కల్చర్, నిర్మాణ రంగ పనుల్లో ఉపాధి అవకాశాలు ఇజ్రాయెల్ తెరవడంతో ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ వెళ్లే పురుషుల సంఖ్య బాగా పెరిగింది.
హౌస్ మెయిడ్ పనులకే అవకాశం..
ఇజ్రాయెల్‌లో ఎక్కువగా హౌస్ మెయిడ్ పనులకే అవకాశం ఉంటుందని అక్కడ ఎక్కువ కాలం ఉండి స్వగ్రామంలో స్థిరపడిన వారు చెబుతుంటారు.. అందుకే ఎక్కువగా మహిళలే ఇజ్రాయెల్ వెళ్తుంటారని చెబుతుంటారు. అయితే వారంలో ఇక్కడ అయిదు రోజులే పని ఉండడం శుక్రవారం, శనివారం బయట ఉండాల్సి రావడంతో పని భారం కూడా తక్కువ అని చెబుతుంటారు. యూదులు శనివారం విశ్రాంత దినంగా పాటిస్తుంటారు. అందుకే శుక్రవారం రోజునే మెయిడ్‌లకు సెలవు ఇవ్వడం ఉంటుందని అక్కడ పని చేస్తున్నవారు చెబుతుంటారు.
ఇజ్రాయెల్ వెళ్లాలంటే భారీగా ఖర్చుచేయాల్సిందే..
ఇజ్రాయెల్ వెళ్లేందుకు అనేక ఆంక్షలు ఉండడం వల్ల ఏజెంట్లు అక్కడి వీసా రప్పించేందుకు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇజ్రాయెల్ వెళ్లాలంటే ప్రస్తుతం ఇప్పుడు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఇజ్రాయెల్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నవారు చెబుతున్నారు. అయితే ఎవ్వరు ఇజ్రాయెల్ దేశం వెళ్లినా ఇమిగ్రేషన్ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లడం వల్ల ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తున్నారు.





















