(Source: ECI/ABP News/ABP Majha)
AP Elections:మండపేటలో వేగుళ్ళ డబుల్ హ్యాట్రిక్ కొడతారా ? కొత్తపేటలో చిర్లకు బండారు చెక్ పెడతారా ?
తూర్పు గోదావరి జిల్లాలో మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ. మండపేటలో సీనియర్ నేత వేగుళ్ల, కొత్తపేటలో బండారు సత్యానందరావు, రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసుకు టికెట్ ఇచ్చింది.
Assembly Candidates : తూర్పు గోదావరి ( East Godavari, )జిల్లాలో మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది తెలుగుదేశం పార్టీ. మండపేటలో సీనియర్ నేత వేగుళ్ల జోగేశ్వరరావు (Vegulla Jogeswararao)కు సీటు కేటాయించింది. అటు కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావు (Bandaru Satyanandarao), రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసుకు టికెట్ ఇచ్చింది.
మండపేటలో వేగుళ్ల హ్యాట్రిక్ విజయాలు
మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి, వైసిపి మధ్య హోరాహోరీగా పోరు జరగనుంది. టిడిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు వరుసగా నాలుగోసారి పోటీలో దిగుతున్నారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచి... హ్యాట్రిక్ సాధించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వేగుళ్ళ జోగేశ్వరరావు ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడంతో విజయవకాశాలపై ధీమాతో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పోటీలో దిగనున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులు గట్టి పోటీ ఇస్తున్నారు. మండపేట నియోజకవర్గానికి తోట త్రిమూర్తులు కొత్త అయినప్పటికీ నియోజకవర్గంలో డిసైడింగ్ ఓటు ఫ్యాక్టర్స్ కాపులు కావడంతో గెలుపుపై ధీమాతో ఉన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గ నుంచి తోట త్రిమూర్తులు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతి ఎన్నికల్లో ఒక్కొక్క పార్టీలో పోటీ చేసే త్రిమూర్తులు ఈసారి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. టిడిపి వైసిపి అభ్యర్థులు ఇద్దరు మిత్రులు కావడంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది.
రాజమండ్రి సిటీకి ఆదిరెడ్డి వాసు
రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు పేరు ఖరారు చేశారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆదిరెడ్డి వాసు ఎన్నికల్లో పోటీ చేయటం ఇదే మొదటిసారి. వాసు భార్య ఆదిరెడ్డి భవాని ప్రస్తుతం రాజమండ్రి సిటీ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా...తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్‌గా పనిచేశారు. రాజకీయ కుటుంబం కావడంతో ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు బలమైన అభ్యర్థిగా నిలుస్తున్నారు. రాజమండ్రి సిటీ వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ రామ్ బరిలోకి దిగుతున్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన భరత్ గత ఎన్నికల్లో రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 1,80,000 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు.
రాజమండ్రి సిటీలోని బలమైన గౌడ శెట్టిబలిజ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటం భరత్ కు కలిసి వచ్చే అంశం. భరత్ ఎంపీగా పనిచేసిన తన ఐదేళ్ల పాలనలో రాజమండ్రి సిటీ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో రాజమండ్రిలో అభివృద్ధి పనులను చేపట్టారు. మోరంపూడి ఫ్లేఓవర్, ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు, రాజమండ్రి సుందరీకరణ పనులు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. వైసిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతికూల ఫలితాలు వస్తాయని ఆశాభవంతో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు వైసిపి ఓటమి చెందడంతో అధిష్టానం సైతం సీరియస్‌గా తీసుకుని ఈసారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తుంది. దీంతో రాజమండ్రి సిటీలో టిడిపి వైసిపి మధ్య హోరాహోరీగా పోరు సాగనుంది.
చిర్ల జగ్గిరెడ్డిని బండారు ఓడిస్తారా ?
కీలకమైన కొత్తపేట నియోజకవర్గంలో మరోసారి పాత ప్రత్యర్థుల మధ్య మళ్లీ పోరు జరుగునుంది. టీడీపీ తరపున బండారు సత్యానందరావు... సిటింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచిన జగ్గిరెడ్డి మరోసారి విజయం సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగ్గిరెడ్డికి సామాజిక వర్గ ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని ప్రయత్నిస్తున్నారు. కొత్తపేట టిడిపి అభ్యర్థిగా బండారు సత్యానందరావు పేరు ఖరారు చేశారు. సత్యానందరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాపు సామాజిక వర్గానికి చెందిన బండారు సత్యానందరావు గత ఎన్నికల్లో టిడిపి జనసేన వేరువేరుగా పోటీ చేయడంతో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు.