Kakinada News: కాకినాడలో ఉద్రిక్తతలు, రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాటలు
రైతు పోరుబాట కార్యక్రమాన్ని టీడీపీ కార్యాలయం నుంచి మొదలు పెట్టి కలెక్టరేట్ వరకు కొనసాగించాలని మొదలు పెట్టారు.
కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. టీడీపీ నాయకులు కూడా రైతు పోరుబాట కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు టీడీపీ నాయకులు తరలివచ్చారు. ఈ రైతు పోరుబాట కార్యక్రమాన్ని టీడీపీ కార్యాలయం నుంచి మొదలు పెట్టి కలెక్టరేట్ వరకు కొనసాగించాలని మొదలు పెట్టారు. అయితే, రైతులు ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో నగరంలోని జడ్పీ సెంటర్ వద్ద ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తమ ర్యాలీని ఎందుకు అడ్డుకున్నారని రైతులు, టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
దీంతో ఒక్కసారిగా ర్యాలీలో ఉద్రిక్త వాతావరణం మొదలైంది. పోలీసులతో రైతులకు టీడీపీ నేతలకు తీవ్రమైన వాగ్వాదం, తోపులాట జరిగింది. రైతులను అడ్డుకోవడం కోసం పోలీసులు వారికి అడ్డంగా బారికేడ్లు పెట్టారు. అయినా రైతులు, టీడీపీ నాయకులు వాటిని తోసుకుని కలెక్టరేట్ వైపు వెళ్లారు. ఈ ఆందోళనలో ఓ రైతు సొమ్మసిల్లి పడిపోయాడు.
మొత్తానికి రైతులు కలెక్టరేట్ వద్దకు చేరుకుని గేటు బయట ధర్నాకు దిగారు. కలెక్టర్ బయటకు వచ్చి వినతిపత్రం తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యేలు కొండబాబు, వర్మ, మాజీ జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్, టీడీపీ రైతు విభాగం నాయకుడు శ్రీను బాబు తదితరులు ఉన్నారు.