మాయమాటలు చెప్పం- పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే : లోకేష్
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. నిర్వాసితులకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ విస్మరించారని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్వాసితులకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ విస్మరించారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద లక్షా 15 వేల నుంచి లక్షా 40 వేలిచ్చారని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్. దాన్ని 6 లక్షల 36వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదేనన్నారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 198వరోజు పోలవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు లోకేశ్‌తో కలిసి నడిచారు. పలువురు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. పాదయాత్రలో భాగంగా.. పోలవరం నిర్వాసితులతో లోకేశ్ ముఖాముఖిగా సమావేశం అయ్యారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో జగన్ మాటలు నమ్మి మోసపోయామని లోకేశ్ వద్ద నిర్వాసితులు గోడు వెళ్లబోసుకున్నారు. వారి సమస్యలను తెలుసుకున్న ఆయన... భరోసానిచ్చే ప్రయత్నం చేశారు
తెలుగుదేశం పార్టీ హయాంలోనే... పోలవరం పనులు 72 శాతం పూర్తయ్యాయని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదంలో అందని ఆందోళన వ్యక్తం చేశారు. మోసానికి మరో రూపం సైకో జగన్ అన్న ఆయన... ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.10 లక్షలు ఇస్తామన్నారని ఇప్పటికి దాన్ని ఇవ్వలేదని విమర్శించారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు అనేక హామీలిచ్చిన జగన్...ముఖ్యమంత్రి అయ్యాక చేతులెత్తేసారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే...బటన్ నొక్కుతున్నారని మండిపడ్డారు. అప్పుడొక మంత్రిగారు ఉండేవారని.. బుల్లెట్ దిగిందా అని విమర్శలు చేసారని.. ఇప్పుడు ఆయనకే బుల్లెట్ దిగిందంటూ కౌంటర్ ఇచ్చారు. సదరు మంత్రికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు టికెట్ వస్తుందో లేదో...ఆయనకే తెలీదంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ ను ఉద్దేశించి సెటైర్లు వేస్తూ వ్యాఖ్యానించారు. ప్రస్తుత నీటి పారుదల శాఖ మంత్రి...పోలవరం గురించి అడగవద్దని పదే పదే చెబుతున్నారంటూ మండిపడ్డారు.
గతంలో టీడీపీ ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని...మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇస్తామన్నారు నారా లోకేశ్. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో తగ్గేది లేదని స్పష్టం చేశారు. జగన్ లా మాయ మాటలు చెప్పి, రేపు అధికారంలోకి వచ్చాక పరదాలు కట్టుకుని తిరగాలనే కోరిక లేదన్నారు లోకేశ్. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. లక్షా 15 వేల నుంచి 6 లక్షలకు పెంచిన ఘనత చంద్రబాబుదేనన్నారు.
45.72 మీటర్ల ఎత్తుతో పోలవరం కట్టాలని అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నామన్నారు లోకేశ్. తెలంగాణ నుంచి ముంపు మండలాలను ప్రధాని మోదీ సహకారంతో విలీనం చేసుకున్నామని వెల్లడించారు. నిర్దేశించిన ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ప్రకటించారు. నిర్వాసితులకు నష్ట పరిహారాన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద అందజేయడం, మౌలిక సదుపాయాలతో కాలనీలు నిర్మించడం ప్రథమ కర్తవ్యమన్నారు లోకేశ్. పోలవరం నిర్వాసితుల కోసం తమ ప్రభుత్వ హయాంలో 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక...పోలవరాన్ని పూర్తి చేసేది చంద్రబాబునేనని స్పష్టం చేశారు.