తాటి పండు గుజ్జుతో అదిరిపోయే వంటకాలు !
రుచితోపాటు అద్భుతమైన పోషకాలను అందించే తాటిపండు గుజ్జుతో దిబ్బరొట్టెలు, ఇడ్లీ, కుడుములు తయారు చేస్తూ.. ఆహా అనిపిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా ప్రజలు. మీరూ ఓ లుక్కేయండి.
ఏ రోజుకారోజు రెక్కాడితే కానీ డొక్కాడని దైన్యం. అదే ముసురు పడితే ఇక పేదోడి కడుపు కాలి సోలడు(పావుకిలో) బియ్యం గింజల కోసం యజమాని దగ్గర పడిగాపులు. ఇలా ఎన్నో కష్టాలు పడ్డ నిరుపేదలకు పనిలేని రోజుల్లో పరమాన్నంగా కడుపునింపింది తాటిపండు. తాటి పండును కాల్చుకుని తిని బతికిన రోజులున్నాయని చెప్పే పూర్వీకులు గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ అనేకం. అయితే కాల క్రమేణా విస్తరించిన ఆవాస ప్రాంతాల వల్ల తాటిచెట్లు కనుమరుగవుతున్న క్రమంలో తాటిపండ్ల ప్రాముఖ్యత కూడా నేటి తరానికి దూరం అవుతూ వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తాటిపండుతో చేసిన వంటకాలకు అంతే క్రేజ్ ఉంది. ఎందుకంటే ఘుమ ఘుమలాడే వాసనతోపాటు పోషక విలువలున్న తాటి పండుతో చేసిన పలు రకాల వంటకాలంటే నేటికీ ఇష్టపడేటోళ్లు ఉన్నారు. పల్లెల్లో ఉచితంగా దొరికే తాటిపండ్లను తెచ్చి పట్టణాల్లో అమ్ముతున్నారు. ప్రస్తుతం పట్టణాల్లోనూ పలువురు చిరు వ్యాపారులు.. ఇడ్లీలు, దిబ్బ రొట్టెలు, గారెలు, మంగా కుడుములు ఇలా వైరైటీలు తయారు చేసుకొని అమ్ముతున్నారు. అంతే కాదండోయ్ నిప్పుల మీద కాల్చిన తాటిపండు యమ టేస్టీ అని కూడా చాలా మంది అస్వాదిస్తూ తింటుంటారు.
తాటి పేసంతో ఈ వంటకాలు భలే ఫేమస్..
తాటి చెట్టుకు కాచిన తాటి కాయలు తొలి దశలో తాటి ముంజులుగా లభిస్తాయి. అవికూడా చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. అవి చెట్టునే అలానే ఉంచేస్తే అవి ముదిరిపోయి తాటిపళ్లుగా మారతాయి. తాటికాయ నుంచి పండుగా మారిన క్రమంలో వాటికవే నేలకు రాలిపోతాయి. వాటిని తీసుకెళ్లి మరో రెండు రోజులు జాగ్రత్తగా భద్రపరిస్తే మరింత ముగ్గి మరింత వాసనతోపాటు గుజ్జు(పేశం) ఎక్కువగా లభిస్తుంది. తాటిపండు పైనున్న తొక్కను జాగ్రత్తగా తీసి దానిలో ఉండే రెండు లేదా మూడు టెంకలను వేరు చేసి ఆ టెంకలకున్న గుజ్జును ఏదైనా పాత్ర వంచన పెట్టి అదిమి రాస్తుంటే పేశం ఆ పాత్రలోకి వస్తుంది. ఆ పేశంలోని తాటివపీచును తీసి వేసి ఇడ్లీ పిండి లేదా బియ్యం రవ్వతో కలిపి మరింత తీపిదనం కోసం బెల్లం లేదా పంచదార, మరింత కమ్మదనం కోసం కొబ్బరి తురుము వేసి ఇడ్లీలు, కుడుములు, దిబ్బ రొట్టెలు, నూనెలో వేయించి గారెలుగా చేస్తుంటారు. ఇంకా పలు రకాల వంటలను చేస్తారు.
తాటిపండులో పోషకాలు ఎన్నో...
తాటి చెట్లకు ఎటువంటి రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు కొట్టే అవకాశం లేనందున తాటి పండు పూర్తిగా సహజ సిద్ధంగా ఎంతో పోషక విలువలతో ఉంటుంది. తాటి పండులో ఎక్కువ పీచు పదార్ధం ఉండడం వల్ల జీర్ణ క్రియకు చాలా మంచి చేస్తుంది. జీర్ణకోశ వ్యాధులు, మలబద్దకం వంటి వాటిని తాటి పండులోని పీచు పదార్ధం నివారిస్తుంది. అంతేకాదు రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు, మెదడు చాలా చురుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది. తాటి పండులో ఎక్కువగా ఏ, సీ విటామిన్లతో పాటు బీ కాంప్లెక్, ఐరన్ ఉండడం వల్ల రక్తహీనతకు కూడా ఇది సంజీవనే అని చెప్పవచ్చు.
తాటి ఉత్పత్తులకు భలే డిమాండ్..
తాటిచెట్లు ద్వారా తాటి కల్లు లభిస్తుంది. ఇది తగు మాత్రంలో సేవిస్తే చాలా వ్యాధులు నయం అవుతాయని చాలా మంది నమ్మకం. గ్రామీణ ప్రాంతాల్లో తాటి కల్లుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక వేసవిలో లభించే తాటి ముంజలు చాలా మందికి ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. తాటి ముంజలు ముదిరి తాటి పళ్లుగా మారిన క్రమంలో అవి అలానే భూమిలో పాతిపెడితే తాటి టెంకల నుంచి తేగలు మొలుస్తాయి. వాటిని కాల్చి తింటే వాటి రుచి వేరే లెవెల్లో ఉంటుంది.