Rooster Fight: కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు: ఏలూరు డీఐజీ పాలరాజు
Rooster Fight: కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏలూరు డీఐజీ పాలరాజు తెలిపారు. అమలాపురం అల్లర్ల కేసులో 50 మంది తప్పించుకోగా.. 251 మందిపై ఎఫ్ఎఆర్ నమోదు చేసినట్లు వివరించారు.
![Rooster Fight: కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు: ఏలూరు డీఐజీ పాలరాజు Rooster Fight Konaseema District News Eluru Range DIG Palaraju Warning to Who Held Cock Fights Rooster Fight: కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు: ఏలూరు డీఐజీ పాలరాజు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/25/b1aacb3c09d288b275e6000e60f004901671949863605519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rooster Fight: ఏలూరు రేంజ్ పరిధిలో కోడి పందాలు నిర్వహించినా, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని ఏలూరు రేంజ్ డీఐజీ పాల రాజు హెచ్చరించారు. కాకినాడ జిల్లా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయాల పరిధిలో పలు పోలీస్ స్టేషన్ లను ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన రికార్డులను పరిశీలించారు.
కోడిపందాలు పై ఉక్కుపాదం...
కోడిపందాలపై ఉక్కుపాదం మోపుతామని డీఐజీ పాలరాజు స్పష్టం చేశారు. పందాలు ఆడడం, నిర్వహించడం చట్టరీత్యా నేరమని చెప్పారు. సంక్రాంతి సంబరాలు, సంప్రదాయాలు, సెలవులంటూ పందాల జోలికు వంళ్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో కోడి పందాలను నిర్వహించిన వారందరి వివరాల్ని సమీకరిస్తున్నామన్నారు. ముందస్తుగా వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఐదు లక్షల పూచీకత్తుతో స్టేషన్ బెయిల్ ఇస్తామన్నారు. అప్పటికీ వారు పందాలకు పాల్పడితే ఈ మొత్తాన్ని సీజ్ చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సంప్రదాయ క్రీడల్ని నిర్వహిస్తున్నామని వివరించారు. యువకులు ముందుకొచ్చి వాటిలో పాల్గొనాలని సూచించారు.
50 మందికి పైగా పరారీ...
కోనసీమ అల్లర్లకు సంబంధించిన కేసులో ఇంకా 50 మదికి పైగా పరారీలో ఉన్నట్లు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు తెలిపారు. ఈ కేసుల్లో ఇప్పటి వరకు 251 మందిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాల్ని నియమించినట్లు ఆయన వెల్లడించారు. విధ్వంసం జరిగిన వెంటనే పోలీసులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారి తెలిపారు. ఈ కారణంగానే అల్లర్లు మూడు రోజుల్లోనే అదుపులోకి వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇంటర్ నెట్ నిలిపేయడం కూడా ఇందుకు సహకరించిందని అన్నారు. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను ధ్వంసం చేశారని, పోలీస్ వాహనాల్ని కూడా దగ్ధం చేశారని వివరించారు. ఆర్టీసీకి కూడా నష్టం చేశారని వెల్లడించారు. ఆస్తి నష్టం అంచనాల్ని రెవెన్యూ అధికారులు రూపొందిస్తున్నారని స్పష్టం చేశారు. నిందితుల నుంచే ఈ నష్టాన్ని రికవరీ చేస్తామని చెప్పారు.
అనంతబాబు కేసులో స్వయంగా దర్యాప్తు..
ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ హత్యానేరం కేసులో తానే స్వయంగా దర్యాప్తు చేసినట్లు డీఐజీ స్పష్టం చేశారు. ఈ కేసు పరిశోధనలో పోలీసులు అత్యంత సమర్ధవంతంగా పని చేశారని అన్నారు. పూర్తి సాక్ష్యాధారాలు సేకరించామని తెలిపారు. సంఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి వివరాలు సేకరించామన్నారు. తొలుత దీన్ని ప్రమాదంగా, అనుమానాస్పద మృతిగా ప్రచారం చేశారని పేర్కొన్నారు. కానీ తాను స్వయంగా బరిలో దిగి పర్యవేక్షణ చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహించామని తెలిపారు. ఈ కారణంగానే నిందితులు ఏడుమాసాల పాటు జైల్లో గడపాల్సి వచ్చిందని చెప్పారు. డీఐజీ వెంట కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ లతా మాధురి ఉన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)