Ramachandrapuram News: మంత్రి ఇలాఖాలో దారుణం.. మహిళా ప్రయాణికులపై అసభ్య ప్రవర్తన.. ప్రశ్నించిన ఆటో డ్రైవర్‌పై దాడి
ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇలాఖాలో ఆటో కోసం వేచి చూస్తున్న మహిళలపై ఓ గ్యాంగ్ రెచ్చిపోయింది.. ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన ఈ ఘటనతో ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి..

మహిళల రక్షణ కోసైం శక్తి యాప్ ద్వారా మహిళలను చైతన్యవంతులుగాచేసి రక్షణ కల్పించే చర్యలు చేపడుతుంటే కొందరు పోకిరీలు ఒంటరిగా ఉన్న మహిళలపై అసభ్య ప్రవర్తనతో రెచ్చిపోతున్నారు.. ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇలాఖాలో ఆటో కోసం వేచి చూస్తున్న మహిళలపై ఓ గ్యాంగ్ రెచ్చిపోయింది.. రాత్రంతా తాగి తందనాలు అడి వెళ్లిపోతూ తెల్లవారు జామున వారి ప్రవర్తనతో భయాందోళనలకు గురైన పరిస్థితి తెలెత్తింది.. ఈ దుర్మార్గంపై ప్రశ్నించిన ఆటో డ్రైవర్‌పై విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా నానా దుర్భాషలాడుతూ దిక్కున్నచోట చెప్పుకోవాలని బెదిరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. పైపెచ్చు మేము మంత్రిగారి మనుషులం.. ఏం చేసుకుంటావో చేసుకో అనడం మంత్రి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తోన్న రామచంద్రపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అర్ధం అవుతోందని సామాజిక వేత్తలు విమర్శస్తున్న పరిస్థితి కనిపిస్తోంది..
ఆ రోజు అసలేం జరిగిందంటే...
ఈనెల 13న తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో మాచవరం వంతెన వద్ద చింతపల్లి సత్యసాయి ప్రసన్న, అనుసూరి కీర్తన, అనుసూరి అన్నపూర్ణ, అనుసూరి శ్రీను కలిసి హైదరాబాదు నుంచి బస్సు దిగి మాచవరం వంతెన వద్ద ఆటో కోసం ఎదురు చూస్తున్నారు.. ఆ సమయంలో వారి వద్దకు కారు వచ్చి ఆగింది.. అందులో ఫుల్ గా మద్యం సేవించిన నలుగురు కారు ఎక్కండి.. లేకపోతే మిమ్మల్నిచంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడి దుర్భాషలాడుతున్న సమయంలో అప్పుడే బయటకు వెళ్లి వచ్చిన తండ్రి ఎదురు తిరగగా అతనిని తీవ్రంగా గాయపరిచారని వారు పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు.
అనంతరం వారు ఫోన్ చేసిన ఆటో వచ్చిందని గమనించి ఆటోలో ఎక్కి ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా సోమేశ్వరం శివాలయం సెంటర్ కు వచ్చేసరికి కారులో వెంబడించి ఆటోకి అడ్డంగా పెట్టి ఆటోలో ప్రయాణిస్తున్న వారిపై ఎదురుదాడికి దిగి మహిళలు ఒడిలో చంటిపాన ఉందని కూడా చూడ కుండా తీవ్రంగా దాడి చేశారని వారు తెలిపారు. తాము ఎంత బ్రతిమాలుతున్నా వినకుండా ఆటోను అడ్డగించి వినయవంశీ, మరో ముగ్గురు యువకులు తమను భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు. తన భార్య అన్నపూర్ణపై దాడి చేసి వంశీ కొట్టాడన్నారు. గొడవవద్దు తమను వెళ్లనీయండి అని బ్రతిమాలినా వినలేదన్నారు. ఆ సమయంలో మద్యం సేవించి వారి ప్రవర్తన వింతగా కన్పించిందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
అడ్డుకున్న ఆటో డ్రైవర్‌పైనా దాడి..
రాయవరం మండలంలోని వి.సావరం గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణారావు ఆటో నడుపుకుంటున్నాడు. సోమవారం వేకువజామున 3.30 గంటల సమయంలో హైదరాబాదు నుంచి వస్తున్న వారిని తీసుకుని వచ్చేందుకు మాచవరం వంతెన వద్దకు చేరుకున్నాడు. వారిని ఆటోలో ఎక్కించుకుని వి.సావరం గ్రామం వెళ్తున్న సమయంలో సోమేశ్వరం గ్రామం వద్ద సోమేశ్వరం గ్రామానికి చెందిన వినయ్ వంశీ అనే వ్యక్తి ఆటోను అడ్డగించి, డ్రైవర్ రామకృష్ణపై దాడి చేశాడు. అదే సమయంలో డ్రైవర్ పై దాడిని అడ్డుకున్న అన్నపూర్ణపై కూడా వినయ్ వంశీ దాడి చేశాడు. వంశీతో పాటుగా ముగ్గురు వ్యక్తులు సైతం ఆటో డ్రైవర్ రామకృష్ణ ఆటోలో ప్రయాణిస్తున్న అన్నపూర్ణపై దాడి చేసి దురుసుగా ప్రవర్తించారు. దాడికి గురైన రామకృష్ణ అనపర్తి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరగా, ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మరో ఆటోలో ఇంటికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆటో డ్రైవర్ రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయవరం హెడ్ కానిస్టేబుల్ పీ వీర్రాజు కేసు నమోదు చేయగా మండపేట రూరల్ సీఐ పి దొరరాజు, ఇన్చార్జి ఎస్ఐ హరీష్ కుమార్, పర్యవేక్షణలో దాడికి పాల్పడ్డ వంశీ పై 126(2), 308(5), 115(2) 79. 351(3) 35 253(5) 2 యాక్ట్ ప్రకారం కేను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పీ దొర రాజు తెలిపారు.
రాత్రయితే చాలు.. మందుబాబుల వీరంగం..
రామచంద్రపురం నియోజకవర్గంలో రాత్రయితే చాలు మందుబాబులు, గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టిస్తోందని పలువురు వాపోతున్నారు.. వారిలో చాలా మంది మంత్రిగారి అనుచరులమని రుబాబు చేస్తున్నారని మండిపడుతున్నారు. పైగా కార్లు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారంటున్నారు.. కొందరైతే రాత్రంతా మద్యం సేవిస్తూ రోడ్లపై వీరంగం సృష్టిస్తున్నారని ఎక్కువగా హైదరాబాదు నుండి వచ్చే ప్రయాణికులు తెల్లవారుజామున రెండు గంటల నుండి ఉదయం 6 గంటల వరకు బస్సులు దిగుతారని, ఆ సమయంలో అక్కడి వచ్చి వీరు చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదంటున్నారు. చాలా మంది ఆటో డ్రైవర్లకు ఫోను చేసిన వెంటనే అక్కడివచ్చి వారి గమ్యస్థానాలకు తీసుకువెళ్తున్న క్రమంలో ఆటోలను అడ్డగించి మరీ దాడులకు దిగుతున్నారని, తాజాగా జరిగిన సంఘటన అలాగే జరిగిందని ఆటో డ్రైవర్లు ఆరోపించారు.
ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించి మహిళలకు, ప్రయాణికులకు, ఆటో డ్రైవర్లకు రక్షణ కల్పించాలని ఆటో డ్రైవర్లు కోరారు. ఈ ఘటన జరిగిన వెంటనే రాయవరం మండలం, బిక్కవోలు మండలంలోని ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులందరూ తమ ఆటోలు వేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని గాయపడ్డ ఆటో డ్రైవర్లకు ప్రయాణికులకు తమ సంఘీభావం తెలియజేశారు.





















