(Source: ECI/ABP News/ABP Majha)
Amalapuram Protests: అమలాపురం విధ్వంసంపై పోలీసులు విశ్లేషణ- కారుకులను గుర్తించే పనిలో ఖాకీలు
అమలాపురంలో పరిస్థితులు చక్కదిద్దుతున్న పోలీసులు... విధ్వంసానికి కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. నిఘా వ్యవస్థ సమాచారంతోపాటు వీడియోలు ఆధారంగా విచారణ చేస్తున్నారు.
అమలాపురంలో పరిస్థితులు చక్కదిద్దుతూనే నిన్నటి అల్లర్లకు కారణమైన వారిని వెతికే పనిలో పడ్డారు పోలీసులు. ఖాకీలపై దాడి చేసి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. వివిధ సోర్స్‌ల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు.
అమలాపురాన్ని అగ్ని గుండలా మార్చి రణరంగం సృష్టించిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. విధ్వంసకాండ సృష్టించిన వారి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించాయి పోలీసులు టీంలు. వీడియో రికార్డులు, సీసీ కెమెరాలు పుటేజీలు, ఫోటోలు, మీడియా రికార్డు చేసిన ఫుటేజ్‌ను సేకరిస్తున్నారు. వాటి ఆధారంగా కీలకమైన వ్యక్తులను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ప్రస్తుతం తమ చేతిలో ఉన్న సాక్ష్యాలు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు.. శాంతి భద్రతలపై కూడా ఫోకస్ చేశారు. వివిధ ఫోన్లు, సోషల్ మీడియా, వాట్సాప్ మెసేజ్‌లను కూడా విశ్లేషిస్తున్నారు. అసలు ఎక్కడ నుంచి ఈ విధ్వంసానికి ప్లాన్ జరిగింది... ఎవరు ఎగ్జిక్యూట్ చేశారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు.
కోనసీమలో కర్ఫ్యూ అమలు చేస్తున్న పోలీసులు అమలాపురంపై ప్రత్యేక నిఘా పెట్టారు. మరోసారి ఆందోళనలు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం నాటి పరిస్థితులు మరోసారి తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతానికి అమలాపురంలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలు అవుతోంది.
అల్లర్లకు కారణం కాకుండా ఉండేందుకు కమ్యూనికేషన్ వ్యవస్థపై నిఘా పెట్టారు పోలీసులు. ముందు జాగ్రత్తగా అన్ని మొబైల్ నెట్‌వర్క్ జామ్ చేశారు. ఈ మేరకు ఆయా సంస్థలకు పోలీసులు సమాచారం అందించారు. అనుక్షణం పరిస్థితిని సమీక్షిస్తున్న ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు... వీలైనంత త్వరగా పరిస్థితి పూర్తిగా అదుపులోకీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.