Mahasena Rajesh Joins TDP: టీడీపీలో చేరిన మహాసేన రాజేష్, పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానం
మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలతో భేటీ అయిన మహాసేన రాజేష్ శుక్రవారం ప్రతిపక్ష పార్టీ కండువా కప్పుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు ఇటీవల షాకిచ్చిన మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలతో భేటీ అయిన మహాసేన రాజేష్ శుక్రవారం ప్రతిపక్ష పార్టీ కండువా కప్పుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో దళిత సామాజికవర్గంతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహాసేన రాజేష్ కు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. జనసేన ఎలాగూ టీడీపీ, లేక బీజేపీతో పొత్తు పెట్టుకునేలా కనిపించడంతో నేరుగా ఓ పార్టీలో చేరాలని మహాసేన రాజేష్ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో కీలక పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నాయని, పార్టీలో చేరితే మంచిదని రాజేష్ టీడీపీ నేతలు ఇటీవల భేటీలో చెప్పినట్లు తెలుస్తోంది.
టీడీపీలో చేరిన అనంతరం మహాసేన రాజేష్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబును దళిత ద్రోహి అని చిత్రీకరించి వైఎస్ జగన్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. తాము అప్పటి ప్రతిపక్షనేత జగన్ మాటలు నమ్మి చంద్రబాబును అపార్థం చేసుకున్నట్లు తెలిపారు. దళిత ద్రోహి ఎవరూ, దళితులకు అన్యాయం చేస్తున్నది ఎవరో తాము త్వరగానే గ్రహించామని మహాసేన రాజేష్ అన్నారు. చంద్రబాబు ఏపీలో ఎస్సీల కోసం 27 సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తుచేసుకున్నారు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఆ పథకాలను రద్దు చేశారని చెప్పారు. గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు తప్పు చేయకుండా ఉండి, టీడీపీని గెలిపించి ఉంటే ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయ్యేదన్నారు. జగన్ తుగ్లక్ పాలన చూసిన తరువాతే ప్రజలకు వాస్తవాలు అర్థం అవుతున్నాయని, చీకటి వచ్చిన తరువాతే వెలుగు విలువ తెలుస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం అని దీమా వ్యక్తం చేశారు.
ఆ పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం
మహాసేన కష్టాల్లో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన మద్దతుగా నిలిచాయని రాజేష్ తెలిపారు. టీడీపీలో జాయిన్ అవ్వాలని భావించిన ఓ రాష్ట్ర స్థాయి నేత అడ్డుపడడంతో కుదరలేదని, దీంతో జనసేనకు దగ్గరయ్యామన్నారు. జనసేన చేపట్టిన కొన్ని కార్యక్రమాలకు ఆ పార్టీ ఆహ్వానం మేరకు హాజరయ్యానని రాజేష్ గుర్తు చేశారు. జనసేన పార్టీ కోసం కష్టపడదామని సిద్ధమయ్యామని, కానీ పరిస్థితులు మారిపోయాయన్నారు. దీంతో 2022 డిసెంబర్ 8న అంబేడ్కర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించామన్నారు. జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉందని, భవిష్యత్తులో టీడీపీతో జతకడితే బీజేపీ ఎంపీ సీట్లు అడుగుతుందని సమాచారం ఉందన్నారు. టీడీపీ కూడా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే యోచనలో ఉంది కాబట్టి ఆ పార్టీలో చేయాలని చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. టీడీపీ నేతలు తనకు ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించినట్లు మహాసేన రాజేష్ చెప్పుకొచ్చారు. తనను గతంలో వ్యతిరేకించి నేతలో మార్పు వచ్చిందని ఆయన మహాసేనను తప్పుగా అర్థం చేస్తున్నారని ఫీలయ్యారన్నారు. మహాసేన అగ్ర వర్ణాలకు వ్యతిరేకంగా మాట్లాడిందని అనుకున్నారని, పూర్తి సమాచారం తెలియక మాట్లాడామని ఆ నేత చెప్పారన్నారు.
జనసేన నుంచి ఆహ్వానం రాలేదు
జనసేనలో చేరడానికి సిద్ధమైనా, టీడీపీ నేతల మాటలను బట్టి ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని మహాసేన రాజేష్ తెలిపారు. జనసేనకు దగ్గరయ్యాం కాబట్టి ఆ పార్టీలో చేరాలని భావించామని కానీ జనసేన పార్టీ ఎప్పుడూ తనను పార్టీలోకి ఆహ్వానించలేదని తెలిపింది. పొత్తులపై స్పష్టత వచ్చిన తర్వాత రాజేష్ ను పార్టీలోకి తీసుకుందామని జనసేన అగ్రనేతలు భావించినట్లు తెలిసిందన్నారు.