Konaseema: ‘కోనసీమ’ పేరు మార్పుపై ఉద్రిక్తతలు, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ - కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
Konaseema: అంబేడ్కర్ పేరు జిల్లాకు వద్దు అంటూ రెచ్చగోట్టేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Konaseema District News: కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును జోడిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ప్రిలిమినరీ నోటీసు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. కోనసీమ వ్యాప్తంగా రెండు వర్గాలు కోనసీమ జిల్లాను అలాగే కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్‌తో కలెక్టర్ కు వినతిపత్రాలు సమర్పించేందుకు పిలుపునివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. రెండు రోజుల క్రితం కోనసీమ కలెక్టరేట్ వద్ద కొందరు కోనసీమ జిల్లా పేరును అలానే ఉంచాలంటూ భారీ ర్యాలీ చేపట్టి గేట్లు దాటుకుని లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. దీంతో సోమవారం ఉదయం నుంచి కోనసీమ వ్యాప్తంగా ముఖ్యంగా జిల్లా కేంద్రం అమలాపురంలో 144 సెక్షన్ అమలులో ఉంచినట్లు ప్రకటించారు. వారి వారి వినతి పత్రాలను ఆయా మండల కేంద్రాల్లో జరిగే స్పందన కార్యక్రమాలకు సమర్పించాలని, అంతేకానీ జిల్లా కేంద్రానికి ఎవ్వరూ రావాల్సిన అవసరం లేదని ప్రకటించారు.
భారీ బందోబస్తు నడుమ జిల్లా కేంద్రం..
కోనసీమ జిల్లా పేరు విషయంలో గత నాలుగు రోజులుగా కోనసీమ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు గత వారం రోజులుగా సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. పోలీసు ఆంక్షలు ఉన్నా రెండు రోజుల క్రితం ఆందోళన చేసిన పలువురిని గుర్తించి ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సోమవారం స్పందన కార్యకమానికి పెద్దఎత్తున తరలివచ్చి వినతిపత్రాలు సమర్పించాలని పలువురు సోషల్ మీడియా వేదికగా పిలుపునివ్వడంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడే ఆంక్షలు అమలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు
అంబేడ్కర్ పేరు జిల్లాకు వద్దు అంటూ రెచ్చగోట్టేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొన్ని సంఘ విద్రోహశక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారని, ఇది గమనించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అదేవిధంగా కులాల వారీ సమీకరణాలు, ఎటువంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వెనకనే ఉండి నడిపిస్తున్న పార్టీలు?
కోనసీమ జిల్లాకు మరే పేరు వద్దు.. కేవలం కోనసీమ మాత్రమే ముద్దు అన్న నినాదంతో పలువురు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తుండగా మరి కొందరు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు ప్రపంచంలో అనేక సంస్థలకు ఉన్నాయని, జిల్లాకు పెడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా అంబేడ్కర్ పేరును వ్యతిరేకిస్తున్నవారిలో ఆర్ఎస్ఎస్ ప్రభావిత శక్తులు ఎక్కువగా పనిచేస్తున్నాయని, ఈ ఉద్యమం వెనుక రెండు పార్టీలు వెనుకుండి నడిపిస్తున్నాయని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరో వైపు ఇప్పటికే మహాసేన ఆర్గనైజేషన్ నిర్వాహకులు సిరిపల్లి రాజేష్ మంత్రి విశ్వరూప్ పై తీవ్ర సంచలనమైన ఆరోపణలు చేశారు. వైసీపీలోని ఓ వర్గం నాయకులను రెచ్చగొట్టి అంబేడ్కర్ పేరుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయిస్తున్నారని, మరో వైపు దళిత సంఘాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.