Atchannaidu: సైకో కంటే పిచ్చోడు అనడం కరెక్ట్! ముందస్తు ఎన్నికలకు మేం రెడీ - అచ్చెన్నాయుడు
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిసి, పాడిందే పాట పాచిపళ్ళ దాసరి అన్న చందంగా పాత పాటే పాడారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ సర్వే వచ్చినా వైసీపీ ఓటమి ఖాయమని, టిడిపి గెలుపు ఖాయమని చెబుతున్నాయని అన్నారు. ఐ పాక్ సర్వే కూడా వైసీపీ ఓటమి ఖాయమని చెప్పిందని అన్నారు. వాస్తవ పరిస్థితులు చూస్తే నాలుగేళ్ల పాలనలో ఆయన అన్ని రంగాలలో ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
అందుకే జగన్ ఢిల్లీకి పరుగుపెట్టి ముందస్తు ఎన్నికలు పెట్టుకోవడానికి సీఎం జగన్ ప్రాధేయపడ్డారని విమర్శించారు. ‘‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. పలు సందర్భాల్లో అధినేత చంద్రబాబు నాయుడు, నేనూ అదే ప్రకటించాం. రాజమహేంద్రవరం మినీ మహానాడులో ప్రకటించిన సూపర్ ఆరు హామీలు జనంలోకి తీసుకువెళుతున్నాం. ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పొత్తులపై సరైన సమయంలో ప్రకటిస్తాం. పొత్తులపై జగన్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఆయన తండ్రి గతంలో పొత్తులు పెట్టుకోలేదా?’’ అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
‘‘పోలవరం ప్రాజెక్టు ఆలస్యంపై మేం ముందే చెప్పాం. పోలవరంలో ఎంత నీరు వస్తుందో.. ఎలా కిందకు పోతుందో వాళ్ళకు తెలియదు. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. టిడిపి హయాంలో ఏపీ అంటే ఏ ఫర్ అమరావతి.... పీ ఫర్ పోలవరం.. అని చెప్పాం. ఆ రెండూ పూర్తయితే ఏపీ ప్రగతి ఊహించిన స్థాయికి చేరేది. కానీ ఈ సైకో వాటిని నాశనం చేస్తున్నాడు. సీఎం జగన్ కేసుల నుండి తప్పించుకోలేడు. 11 కేసుల విషయంలో తాత్సారం జరిగినా శిక్ష తప్పించుకోలేడు జగన్ రెడ్డి. తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. సైకో అనడం కంటే అతడ్ని పిచ్చోడు అనడం కరెక్ట్’’
‘‘భూముల కేటాయింపులలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడు. లేపాక్షి భూములు హిందూజాకు కేటాయింపులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ అక్రమాలన్నింటికీ జగన్ మూల్యం చెల్లించక తప్పదు. రాజమండ్రి మహానాడులో ప్రకటించింది మేనిఫెస్టో కాదు. సూపర్ సిక్స్ హామీలు. పూర్తి స్థాయి మేనిఫెస్టో తరువాత ప్రకటిస్తాం. రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ ముందుకు వెళుతున్నాం’’ అని అచ్చెన్నాయుడు మాట్లాడారు.