(Source: ECI/ABP News/ABP Majha)
Kakinada News: కళ్లు తేలేసి పడిపోయిన విద్యార్థులు, ఏం జరిగిందంటే?
Kakinada News: కాకినాడ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారు. గత 20 రోజులుగా అలా పడిపోతున్నారు. కారణాలు ఏమిటన్నది అన్వేషించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Kakinada News: వాళ్లంతా విద్యార్థిలు.. ఒక్కొక్కరిగా కళ్లు తిరిగి పడిపోతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. రోజూ అలా పడిపోతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా ఏడుగురు విద్యార్థినులు అలా కళ్లు తిరిగి పడిపోయారు. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది ఉండటం వల్ల ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. అసలు ఏంటి ఆ సమస్యా.. ఎందుకు అలా పడిపోతున్నారు అనే విషయాలు ఎవరికీ అర్థం కావడం లేదు.
కాకినాడ జిల్లా యు. కొత్త పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అది. ఆ బడిలోని విద్యార్థినులు వింత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. 20 రోజుల క్రితం ఒక బాలిక కళ్లు తిరిగి కింద పడిపోయింది. శ్వాస తీసుకోవడం లోనూ ఇబ్బంది పడినట్లు పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు తెలిపారు. అలా మొదలైన వింత ఆరోగ్య సమస్య బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఒకరూ, ఇద్దరితో ఆగలేదు. 20 రోజుల్లో ఏడుగురు విద్యార్థినులు అలా కళ్లు తిరిగి పడిపోయారు. వారికి మిగతా వారి లాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. నిన్న రాత్రి మరోసారి 9, 10 వ తరగతి చదువుతున్న విద్యార్థినులు కళ్లు తిరిగి పడిపోయారు. హుటా హుటినా వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇవాళ కూడా ప్రత్యేక తరగతుల కోసం బడికి వెళ్లిన ఏడుగురు బాలికలు అదే తరహాలో కింద పడి పోయారు. వారికి కూడా కళ్లు తిరిగాయని, శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది తలెత్తిందని తోటి విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు వెల్లడించారు. శ్వాస ఆడటం లేదని, ఇబ్బందిగా ఉందని వారు చెప్పడంతో హుటాహుటినా ఆ ఏడుగురు విద్యార్థులను స్థానిక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
విద్యార్థినులను పరామర్శించిన ఎమ్మెల్యే..
విద్యార్థులు అలా కళ్లు తిరిగి పడిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ శాసన సభ్యుడు వర్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. చికిత్స అందుకుంటున్న విద్యార్థినులను పరామర్శించారు. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఏడుగురు బాలికలకు వైద్యులు ఒకే ఆక్సిజన్ కిట్ ద్వారా ప్రాణ వాయువు అందిస్తున్నారు. అలా ఒకే కిట్ తో అంతమ మందికి ఆక్సిజన్ అందించడం పట్ల టీడీపీ అధికార ప్రతినిధి వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కిట్ తో ఆక్సిజన్ అందించడం ఏమిటని వైద్యులను ప్రశ్నించారు. ఎవరైనా ఎమర్జెన్సీతో ఆస్పత్రికి వస్తే వారికి ఎలా ప్రాణ వాయువు అందిస్తారని ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులను ప్రశ్నించారు. బాలికలను వెంటనే కాకినాడ ప్రభుత్వ దవాఖానాకు తరలించాలని కోరడంతో.. వైద్యాధికారులు వారిని అంబులెన్సుల్లో కాకినాడకు తరలించారు.
అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు..
అసలు విద్యార్థినులకు ఏమైంది.. ఎందుకలా పడిపోతున్నారు.. అనారోగ్యం వస్తే అందరికి ఒకేసారి ఎలా వస్తుందన్న అనుమానాలను బాలికల తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.. ఇతర విభాగాల అధికారులు వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు.