Kakinad DCCB Chairman: కాకినాడ డీసీసీబీ ఛైర్మన్ పదవి కోసం టీడీపీ, జనసేన పోటీ - పవన్ జోక్యంతో మారిన సీన్
East Godavari News:కాకినాడ డీసీసీబీ ఛైర్మన్ పదవి కోసం టీడీపీ, జనసేన పోటీ పడ్డాయి. అయితే ఇది చివరకు జనసేనకు దక్కబోతున్నట్టు సమాచారం అందుతోంది.

East Godavari News: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన కాకినాడ డీసీసీబీ పదవి కోసం టీడీపీ, జనసేన హోరాహోరీగా పోటీపడుతున్నాయి. చివరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలుగు చేసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి ఈ పదవిని జనసేన ఖాతాలోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ పదవి కోసం టీడీపీ నుంచి అనేక మంది నాయకులు తమ ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సులు లేఖలతో అధిష్ఠానం వద్దకు చేరారు. కానీ అది వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. అమలాపురానికి చెందిన మాజీ మంత్రి దివంగత మెట్ల సత్యనారాయణరావు తనయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు. ఈ పదవి కోసం ఆయన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌తో రికమండేషన్ చేయించుకున్నా ఫలితం లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు సంబందించి టిక్కెట్టు త్యాగం చేసిన ముగ్గురిలో ఎవరో ఒకరికి ఈ పదవి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది.
పోటీలో జనసేనలో ఆ ముగ్గురు..
కాకినాడ డీసీసీబీ ఛైర్మన్ పదవి అనగానే చాలా మంది ఆశావాహుల పేర్లు వినిపించాయి. ప్రధానంగా టీడీపీ నుంచే ఎక్కువ మంది ఛైర్మన్ గిరీ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. వీరిలో జగ్గంపేట ఎమ్మెల్యే తనయుడు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, కటకంశెట్టి బాబి, పిల్లి సత్తిబాబు, మెట్ల రమణబాబులు ముందు వరుసలో ఉన్నారు. అయితే ఇవేమీ వర్కవుట్ కాలేదని తెలుస్తోంది.
జనసేన నుంచి ప్రధానంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో కొత్తపేట నియోజకవర్గం నుంచి తనకు దక్కాల్సిన సీటు త్యాగం చేసిన బండారు శ్రీనివాసరావు పేరే ప్రముఖంగా వినిపిస్తుండగా మండపేట నుంచి వేగుళ్ల లీలాకృష్ణ పేరు అదే వరుసలో ఉంది. వీరితోపాటు కాకినాడ జిల్లాకు చెందిన ఇద్దరు నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే డీసీసీబీ పని చేసేది పీఏసీఎస్‌ల ప్రాతిపదికన కాగా ఇవి అత్యధికంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే ఉన్నాయి. దీంతో ఈ పదవికి కోనసీమ ప్రాంతానికి చెందిన జనసేన నేతకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వాదన జరుగుతోంది. అందుకే కొత్తపేటకు చెందిన బండారు శ్రీనివాస్‌కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నట్లు తెలుస్తోంది.
వేల మంది రైతులతో ముడిపడిన కాకినాడ డీసీసీబీ..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు వేల మంది ఉంటారు. వీరి కార్యకలాపాలన్నీ గ్రామాల్లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలతో ముడిపడి ఉంటాయి. వ్యవసాయ రుణాల నుంచి ఇతర అవసరాలన్నీ ఈ సంఘాలే తీరుస్తాయి. అయితే వీటన్నింటిపైనా కీలకంగా పర్యవేక్షణ చేసే డీసీసీబీ ఏటా రూ.10 వేల కోట్ల వరకు టర్నోవర్ చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 298 పీఏసీఎస్‌లు ఉండగా ఇందులో తూర్పుగోదావరి 49, కాకినాడ 72 అత్యధికంగా కోనసీమ జిల్లాలో 166, అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి 11 పీఏసీఎస్‌లు ఇందులో కలిసే ఉన్నాయి.
సమస్యల వలయంలో కాకినాడ డీసీసీబీ
వాస్తవానికి డీసీసీబీ ఇంకా మంచి ప్రగతి పథంలో దూసుకుపోవాల్సిన పరిస్థతి ఉండగా అవినీతి ఆరోపణలు, అనేక పెండింగ్ సమస్యలు వెనక్కు లాగుతున్నాయి. దీర్ఘకాలంగా సభ్యత్వ రుసుంల నుంచి పలు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. 2018తర్వాత ఇప్పటి వరకు సొసైటీలకు, బ్యాంక్ డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరపలేదు. దీంతో సభ్యత్వ నమోదు పునరుద్ధరణతోపాటు మార్పులు, చేర్పులు, తుది జాబితాల వెల్లడి, ఇలా కనీసం ఏడాది పాటైనా బ్యాంక్, సొసైటీల ఎన్నికలకు సమయం కావాలి. దీంతో మరోసారి సొసైటీలు, బ్యాంక్ పాలకవర్గాలను నామినేటెట్ విధానంలోనే నియమించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీన్ని గుర్తించి రాష్ట్రంలో అతిపెద్దదైన ఉమ్మడి తూర్పు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్ష పదవితోపాటు డైరెక్టర్ల పదవుల కోసం మూడు పార్టీల్లో హేమాహేమీలంతా ప్రయత్నాలు ప్రారంభించారు.



















