ఏపీ బీజేపీ నేతలు చేయలేనిది పవన్ చేస్తున్నారా? జనసేనాని కామెంట్స్‌పై వైసీపీ రియాక్షన్ ఏంటీ?
ఏపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని, అవినీతి పాలన సాగుతుందంటూ విశాఖలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శలు చేశారు. దీనిపై ఏపీ బీజేపీ సైలెంట్ అయింది. పవన్ మాత్రం ఘాటుగానే స్పందిస్తున్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ విమర్శలను డిఫెండ్ చేసుకోవడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. దాన్ని పొలిటికల్‌గా మరింత క్యాష్ చేసుకోవడంలో బీజేపీ అంతకంటే దారుణంగా ఫెయిల్ అయింది. కానీ ఇప్పుడు పవన్ వాటిని నేరుగా ప్రస్తావించకుండా కేసులు ప్రస్తావిస్తూ షా కామెంట్స్ నిజమే అని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయి, అవినీతి పాలన సాగుతుందంటూ సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల విశాఖలో విమర్శలు చేశారు. వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లైట్ తీసుకున్నారు. ఆధారాలు లేకుండా రాజకీయ విమర్శలు చేయటం పరిపాటి అంటూ అధికార పక్షం నేతలు సైలెంట్ అయిపోయారు. వాటిని కంటిన్యూ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన బీజేపీ నేతలు కూడా ఆ కామెంట్స్‌ను పట్టించుకోలేదు.
ఇక్కడే మరో అంశంపై చర్చ మొదలైంది. హోం మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండానే రాజకీయంగా ఇష్టానుసారంగా ప్రకటనలు చేయటం సాధ్యమా అనే చర్చ మొదలైంది. కానీ అధికార పార్టీ నుంచి కౌంటర్ లేకపోవడంతో బీజేపీ నేతలు కూడా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దూకుడుగా ముందుకు వెళ్ళలేకపోయారు.
తాజాగా పవన్ కామెంట్స్....
అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి చేసిన కామెంట్స్‌పై భారతీయ జనతా పార్టీ నేతలు కూడా పట్టించుకోకపోయినా... ఇప్పుడు పవన్ అందిపుచ్చుకున్నారు. ఆ విమర్శలకు ఆధారాలు ఇస్తున్నా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. అధికార పార్టీ నేతలపై కాకినాడ వేదికగా పవన్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వాటికి ఉదాహరణలతో వివరిస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు. సర్పవరం జంక్షన్ వద్ద జరిగిన సభలో చాలా విషయాలు ప్రస్తావించారు పవన్. ముఖ్యమంత్రి జగన్‌కు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బినామిగా ఉన్నారని ఆరోపించారు. ఇష్టానుసారంగా దందాలు, గంజాయి, మట్కా, అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి బినామిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ప్రత్యేక ఫైల్ కేంద్రం వద్ద ఉందని అన్నారు. మరోవైపున క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కలను కూడ పవన్ వివరించారు. అమ్మాయిల మిస్సింగ్ కేసులకు సంబంధించిన అంశాలు, ట్రైబల్ ఏరియాల్లో అమ్మాయిల ట్రాఫికింగ్ వంటి అంశాలు పవన్ ప్రస్తావించారు.
డీజీపికి కూడా పవన్ కౌంటర్....
రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కి కూడా పవన్ ఇచ్చారు. అమిత్ షా కామెంట్స్ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు కుటుంబం కిడ్నాప్‌కు సంబంధించిన కేసు వ్యవహరంలో డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి చేసిన కామెంట్స్‌కు డీజీపీ కౌంటర్ ఇచ్చారనే అభిప్రాయం కలిగింది. అయితే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు స్పందించక ముందే పవన్ డీజీ కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ విమర్సలు చేశారు. అమ్మాయిల మిస్సింగ్‌కు సంబంధించి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో రికార్డులను పవన్ చదివి వినిపించారు. కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమాచారంపై బీజేపీ నేతలు స్పందించకపోయినా పవన్ స్పందిస్తుండటం చర్చనీయాంశమైంది.