యూజ్డ్ కార్లకు సోలార్ ఎనర్జీ- సెకండ్ హ్యాండ్ కార్లకు పెరిగిన డిమాండ్!
కరోనా సమయంలో యూజ్డ్ కార్లుకు డిమాండ్ బాగా పెరగ్గా ఇప్పుడు వేసవి తాపంతో మరింత పెరిగింది. మంచి కండీషన్‌లో ఉన్న సెకండ్‌హ్యాండ్ కారు కనిపిస్తే చాలు ఎగరేసుకుపోతున్నారు..
ఎప్పుడూ లేనంతగా ఈసారి వేసవి అల్లాడిస్తోంది. బయటకు వెళ్లాలంటే చాలు భరించలేనంత వడగాల్పులు. కానీ తప్పదు వెళ్లాలి. అలాంటి వారంతా ఇప్పుడు కార్లపై పడ్డారు. కొత్తది కొనే స్తోమత లేని వాళ్లు ఉన్నంతలో సెకెండ్ హ్యాండ్ కార్లతో సరిపెట్టుకుంటున్నారు. ఈ వేసవిలో అలాంటి వారు ఎక్కువయ్యారని వ్యాపారులు చెబుతున్నారు.
కరోనా తర్వాత సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు విపరీతంగా పెరిగింది. ఇప్పుడు వేసవి ఎండలు భరించలేని వాళ్లు ఆ సెకెండ్ హ్యాండ్ కార్లవైపే మొగ్గు చూపుతున్నారు. ఎప్పటి నుంచో కారు కొనాలనే ఆశ ఉన్నప్పటికీ వీలు కాని వారు కూడా ఎండకు తాళలేక ఫోర్ వీలర్‌ను ఇంటికి తెచ్చుకుంటున్నారు.
ఇంటిల్లపాదీ వెళ్లేందుకు అనువైనది.. అంతకు మించి మంచి కంఫర్ట్.. వెళ్లాలనుకున్న చోటకు సుఖంగా వెళ్లవచ్చు. రావాలనుకున్న సమయానికి ఎటువంటి ఇబ్బందులు పడకుండా రావచ్చు. పైగా ఠారెత్తిస్తున్న ఎండబారిన పడకుండా ఉండవచ్చు. ఎలాగూ ఇంట్లో పిల్లలతో కలిసి నలుగురికి తక్కువ ఉండటం లేదు. బస్‌కో, ఆటోకో అయ్యే ఖర్చుతో పోలిస్తే కొంచెం ఎక్కువ కావచ్చు. కానీ కంఫర్ట్‌బుల్ మాత్రం వేరే లెవల్ అంటున్నారు వినియోగదారులు.
అందుకే ఇప్పుడు యూజ్డ్ కార‌్లకు క్రేజ్ భలే పెరిగింది. దీంతో డీలర్లు సెకెండ్స్ కార్లు ధరలు అమాంతంగా ఆకాశానకెత్తేస్తున్నారు. ఆన్‌లైన్‌లో కార్లు విక్రయించే యాప్‌లనుంచి పట్టణాల్లో ఉండే యూజ్డ్ కారు విక్రయాల షోరూం వరకు అన్నింటినీ వెతికేస్తున్నారు. అనుకూలమైన ధరకు కారు కనిపిస్తే చాలు ఎగరేసుకుపోతున్నారు.
కరోనా నుంచి పెరిగిన డిమాండ్..
కోవిడ్ సమయంలో రవాణా వ్యవస్థ పూర్తిగా మూసివేయడంతో చాలా మంది మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు యూజ్డ్ కార్లపై పడ్డారు. దీంతో డీలర్లు పంట పండింది. దళారులు అనేక మంది పుట్టుకొచ్చారు. మా కారు అమ్మేస్తామని ఎక్కడైనా మాట వినిపిస్తే చాలు రెక్కలు కట్టుకుని వాలిపోయారు. అది మంచి కండీషన్‌లో ఉంటే ఓ పదివేలు ఎక్కువ ఇచ్చి మరీ ఎత్తుకెళ్లిపోయారు. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతోంది.
వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు..
ఈసారి ఎండలు మామూలుగా లేవు. మాడు పగలగొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అవస్తలు పడుతున్నారు. ఎండల్లో తప్పక ప్రయాణాలు చేసేవారు చెమటలు కక్కుతూ గమ్యస్థానాలకు చేరతున్నారు. సరైన టైంకి బస్సులు, ఆటోలు ఇతర వెహికల్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఎండల తీవ్రత వల్ల ఆర్టీసీ బస్సులు మినహాయిస్తే షేర్ ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు మధ్యాహ్నం రోడ్‌పై కనిపించడం లేదు.. దీంతో ఆర్టీసీ బస్సుల్లోనే గమ్యస్థానాలకు వెళ్లవలసి వస్తోంది. ఈ క్రమంలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంటిళ్ళపాది ఇలా ఇబ్బంది పడటం కంటే ఏదోలా యూజ్డ్ కారు కొనుక్కుందామని అనుకుంటున్నారు. అందుకే సెకండ్ హ్యాండ్ కార్లు క్రయ విక్రయాలు విపరీతంగా పెరిగాయి.
డీలర్లు పంట పడిస్తోన్న సెకెండ్స్ కార్లు...
సెకండ్ హ్యాండ్ కార్లు వినియోగం బాగా పెరగడంతో సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే డీలర్లు, మధ్యవర్తులు పంట పడుతోందంటున్నారు. రూ.లక్ష నుంచి రూ.6 లక్షల మధ్య లో ఉన్న కార్లు ఇటీవల కాలంలో ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఎక్కువగా మైలేజ్ వచ్చి, పెట్టుబడి తక్కువ అయ్యే వాహనాలపైనే ఆసక్తిని కనపరుస్తున్నారు ప్రజలు. సెకండ్ హ్యాండ్ కార్లు వినియోగం, డిమాండ్ బాగా పెరగడంతో కారు కొని అమ్మితే రూ.10 వేలు నుంచి రూ.50 వేలు వరకు లాభాన్ని ఆర్జీస్తున్నారు మధ్యవర్తులు, డీలర్లు.
ఈ కార్లుకు భలే డిమాండ్..
మైలేజీ ఎక్కువ ఇచ్చి, తక్కువ పెట్టుబడి పెడతాయన్న గుర్తింపు ఉన్న కొన్ని బ్రాండ్ కార్లు కొనేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. 2010 నుంచి 2020 వరకు మోడళ్లు వారి వారి తాహతకు తగ్గట్టు కొంటున్నారని సెకండ్ కార్లు అమ్మే డీలర్లు చెబుతున్నారు. కేవలం డీలర్లు మాత్రమే కాకుండా నేరుగా కార్ల కంపెనీలే ఎక్చేంజ్ వంటి సదుపాయాలు కల్పించడంతో జనం బారులు తీరుతున్నారు.
కారు కొంటే కార్డు పాయే...!
ఏదో అప్పోసప్పో చేసి కారు కొందామంటే ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్టు గల్లంతవ్వడంతో లబోదిబోమంటున్నారు మరికొందరు. కారు కొనే ఆసక్తి ఉన్నా రేషన్ కార్డు పోతుందన్న భయం చాలా మందిని ముందగుడు వేయడం లేదు. రూ.లక్ష పెట్టి ఏదో పాత మోడల్ కారు కొంటే కార్డు తీసేశారని ప్రజలు వాపోతున్నారు. ఈ సమస్య మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో తీవ్ర నిరాసను నింపుతోంది. ఎలాగూ కార్డు తీసేశారు కాబట్టి ఇక పోయేదేముంది అనుకుని ప్రభుత్వ ఉద్యోగులు కారు కొనుక్కుంటున్నారు.
ఇలా సెకండ్ హ్యాండ్ కార్లు వినియోగం అయితే మాత్రం గతంతో పోల్చుకుంటే బాగా పెరగింది. దీని ఆధారంగా కుప్పలు తెప్పలుగా యూజ్డ్ కార్ల కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అయితే కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. తక్కువ ధరకు వచ్చిందని తీసుకుంటే కొన్ని రోజుల తర్వాత పూర్తిగా పనికిరాకుండా పోతుందని హెచ్చరిస్తున్నారు.
Also Read: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు విషయాలు చూసుకోకపోతే కష్టమే!