Margani Bharat: నేను 10 సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా చేయగలను - ఎంపీ భరత్ వ్యాఖ్యలు
సీఎం జగన్ అనుమతి తీసుకొని పది సినిమాల్లో హీరోగా చేయగలనని అన్నారు. రఘురామ కృష్ణంరాజు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు.
ఓ ప్రెస్ మీట్‌లో నరసాపురం వైఎస్ఆర్ సీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు తనను ఏకచిత్ర నటుడు అనడాన్ని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తీవ్రంగా తప్పుబట్టారు. తాను తలచుకుంటే హీరోగా 10 సినిమాల్లో నటించగలనని, సూపర్ స్టార్ అవ్వగల సత్తా తనకు ఉందని నొక్కి చెప్పారు. తాను సినిమాలు చేస్తే జనాలు ఆదరిస్తారని, తనకు ఉన్న ఫేస్ గ్లామర్ అటువంటిదని చెప్పారు. అవసరమైతే సీఎం జగన్ అనుమతి తీసుకొని పది సినిమాల్లో హీరోగా చేయగలనని అన్నారు. రఘురామ కృష్ణంరాజు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. ఆయన కామెడీ యాక్టర్‌కు తక్కువ.. పనికిమాలిన యాక్టర్‌కు ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు.
నారా లోకేశ్ గురించి కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ఉత్తర కుమారుడిలా లోకేష్ మాట్లాడుతున్నాడని, లోకేష్ లేకపోతే ఏపీ రాజకీయాల్లో కామెడీ ఉండదని అన్నారు. ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్న ఉత్తరకుమారా.. లోకేష్ అసలు నీ కథేంటి.. ధరలు పెరిగాయని ఈ గందరగోళం ఏంటి? అసలు మీ భాష ఏంటో, మీ బాధ ఏంటో! మా సంగతి సరే మీ చుట్టూ తిరిగే వారికి కూడా అర్థం కావట్లేదు. మీది యువగళమా అది గందరగోళమో అర్థం కావడం లేదు. పెట్రోలు ధరలు పెరిగాయని గగ్గోలు పెడుతున్నారు. మీ హాయాంలోనూ అవే ధరలు ఉన్నాయి. దేశమంతా నిత్యావసరాల ధరలు అంతే ఉన్నాయి’’ అని ఎంపీ భరత్ విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అధిక ధరలే ఆంధ్రప్రదేశ్ లోనూ ఉన్నాయని, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ధరలు పెరిగినట్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడ్డారు.
మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గురించి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు నిద్రపోతున్నారా అంటూ నిలదీశారు. ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు కూడా సీఎం అయినప్పుడు పోలవరం ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని పట్టుబట్టారని అంటుంటారని, ప్రత్యేక హోదా విషయంలోనూ అదే చేయాల్సి ఉందని అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని పట్టబట్టి ఉంటే ఇచ్చేవారేమోనని మార్గాని భరత్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి టీడీపీనే తీరని అన్యాయం చేసిందని మార్గాని భారత్ విమర్శించారు. దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలు విశాఖపట్నానికి తరలిరావడం శుభపరిణామని, ఇది ఓర్వలేకనే విపక్షాలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.