చంద్రబాబుకి ఇంటినుంచే ఆహారం, మందులు
చంద్రబాబుకి ఇంటినుంచి తీసుకొచ్చే ఆహారాన్ని అనుమతించాలని, కుటుంబ సభ్యులు పంపించే మెడిసిన్స్ ఆయనకు అందచేయాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి.
చంద్రబాబు ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే మిగతా ఖైదీలలాగా కాకుండా ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలంటూ ఇప్పటికే ఏసీబీ కోర్టు ఆదేశించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ కి ప్రత్యేకంగా ఆదేశాలిచ్చారు ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి. చంద్రబాబుకి జైలులో ప్రత్యేక గది ఏర్పాటు చేయడంతోపాటు, భద్రత కూడా కల్పించాలన్నారు. అదే సమయంలో ఆయనకు ఇంటినుంచి తీసుకొచ్చే ఆహారాన్ని అనుమతించాలని, కుటుంబ సభ్యులు పంపించే మెడిసిన్స్ ఆయనకు అందచేయాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
చంద్రబాబు ఆహార నియమాలు ఎలా ఉంటాయంటే..?
చంద్రబాబు వివిధ అనారోగ్య కారణాలతో ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఉదయాన్నే మామూలు ఇడ్లీ, లేదా జొన్న ఇడ్లీ తింటారు. ఓట్ ఉప్మా కూడా కొన్నిసార్లు తీసుకుంటారు. మధ్యాహ్నం రాగి, జొన్న, సజ్జలతో చేసిన అన్నం రెండు లేదా మూడు కూరలు, కొంచెం పెరుగు తీసుకుంటారు. సాయంత్రం లోపు కొన్ని డ్రైఫూట్లు తీసుకుంటారు. సాయంత్రం సూప్, లేదా ఎగ్ వైట్ తీసుకుంటారు. రాత్రి ఏడు తర్వాత ఏమీ తినరు. పాలు తాగి పడుకుంటారు. ఈ విషయాలను ఆయనే కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు.
ఇవీ ఆయన ఆహార నియమాలు. మెడిసిన్స్ విషయానికొస్తే.. మెడిసిన్స్ విషయానికొస్తే.. ప్రజల మధ్యకు వచ్చినప్పుడు కూడా ఆయన అప్పుడప్పుడు మధ్యలో మందులు వేసుకుంటుంటారు. ఆ మందుల్ని కూడా ఇంటి నుంచి తెప్పించి ఇవ్వాలని జైలు అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇంటినుంచి వచ్చే ఆహరాన్ని అనుమతించాలని చెప్పింది.
చంద్రబాబు వ్యక్తిగత వైద్యులు కూడా యాత్రల్లో ఎప్పుడూ ఆయన వెంట ఉంటారు. ఆహార నియమాలు, వేళకు కచ్చితంగా మందులు తీసుకోవడంతో ఆయన ఈ వయసులో కూడా యాక్టివ్ గా ఉంటారని అంటారు. అందుకే అలుపెరగకుండా వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు. ప్రజల్ని కలుస్తుంటారు. సమకాలీన రాజకీయాల్లో ఆ వయసులో అంత యాక్టివ్ గా ఉండే నేతల్లో చంద్రబాబు మొదటి స్థానంలో ఉంటారనడం అతిశయోక్తి కాదు. అధికారంలేనప్పుడు కూడా ఆయన కుంగిపోలేదు. తిరిగి అధికారం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ నాయకుల్ని శ్రేణుల్ని ఉత్సాహపరుస్తూ 2024 ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.
హౌస్ అరెస్ట్ పిటిషన్ పై నేడు వాదనలు..
మరోవైపు చంద్రబాబుని జైలుకి తరలించిన తర్వాత, అక్కడ ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు హౌస్ అరెస్ట్ కి అనుమతించాలని కోరుతూ మరో పిటిషన్ కూడా దాఖలైంది. దీనిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు చంద్రబాబుని విచారణకోసం కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ కస్టడీ పిటిషన్ పై కూడా ఈరోజు విచారణ జరిగే అవకాశముంది.
కొనసాగుతున్న ఏపీ బంద్..
ఇటు ఏపీలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయాన్నే టీడీపీ నేతలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. బస్టాండ్ ల వద్ద బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా బంద్ ని సీరియస్ గా తీసుకున్నారు. అర్థరాత్రి నుంచే బందోబస్తు పెంచారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మూడు రోజులుగా టీడీపీ నేతలు కొంతమంది హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారు. చంద్రబాబు రిమాండ్ తర్వాత పోలీసులు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.