Godavari Flood : ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ- లంక గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు
ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు 14 అడుగులు స్థాయికి చేరుకోవడంతో అన్ని గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో లంక గ్రామాలు నీట మునుగుతున్నాయి.
ఎగువ ప్రాంతాల నుంచి ఉవ్వెత్తున వచ్చిపడుతున్న వరద ప్రవాహంతో ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి తీవ్రం అయ్యింది. భధ్రాచలం వద్ద 46.80 అడుగుల స్థాయికి వరద చేరింది.దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు వదర మరింత పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు 14 అడుగులు స్థాయికి చేరుకోవడంతో అన్ని గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. 13లక్షల 27వేల 855 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పొంగి ప్రవహిస్తోన్న నదీపాయలు..
అఖండ గోదావరికి భారీ స్థాయిలో వదర ఉద్ధృతి పెరగడంతో ధవళేశ్వరం నుంచి 13 లక్షలకు పైబడి వరద నీటిని సముద్రంలోకి వదులుతుండడంతో దిగువనున్న గౌతమి, వశిష్ట, వైనతేయ, వృద్ధగౌతమి నదీపాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో మరింత వరద నీరు దిగువకు వదిలే అవకాశాలున్నందున నదీపరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ నాలుగు నదీపాయలు అన్నీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోనే ప్రవహించి తద్వారా సముద్రంలో కలిస్తుండడంతో కోనసీమ జిల్లాపరిధిలో లంక గ్రామాల్లో పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి..
కోనసీమ జిల్లాలో అప్రమత్తం..
ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు భారీ స్థాయిలో సముద్రంలోకి వదులుతుండడంతో నదీపాయల్లో వరద ఉద్దృతి బాగా పెరుగుతోంది. వరద ఉద్ధృతి బాగా పెరగడంతో పలు లంక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అతున్నాయి.. ప్రధానంగా కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల్లోని పలు లంక గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని కనకాయిలంక, అయినవిల్లిలంక కాజ్‌వేలు ముంపుకు గురయ్యాయి. పి.గన్నవరం అక్విడక్ట్ వద్ద వరద ఉరకలెత్తుతోంది.. రాజోలు వద్ద వశిష్ట నదీ ఎడమ గట్టు బలహీనంగా ఉండడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ ముంపుకు గురవుతుండడంతో పశువులకు దాణా దొరకక రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిరది. ఏటిగట్లుపై ఇప్పటికే పశువులను కట్టివేస్తున్నారు.
పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ఆదేశం.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ప్రధానంగా 85 గ్రామాల్లో వరద ముంపుకు గురయ్యే అవకాశాలుండడంతో ఈప్రాంతాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ హిమాన్సుశుక్లా తహసీల్దార్‌లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, అగ్నిమాపక సిబ్బంది ఇలా అన్ని శాఖలను సమన్వయం చేసి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లంక గ్రామాల్లో వరద ఉద్ధృతి ఎక్కువయ్యే అవకాశాలుండడంతో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నావలను, బోట్లును సిద్ధం చేశారు. ధవళేశ్వరం వద్ద రెండు ప్రమాద హెచ్చరికను జారీ చేయడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ టోల్‌ఫ్రీ కంట్రోల్ రూమ్ నెంబరు 18004252532, రామచంద్రపురం ఆర్డీవో ఆఫీస్ 08857245166, కొత్తపేట ఆర్డీవో ఆఫీస్ 9154983102, అమలాపురం ఆర్డీవో ఆఫీస్ 08856233208, 8008803201 నెంబర్లు పనిచేస్తాయని వెల్లడించారు.