(Source: ECI/ABP News/ABP Majha)
ఏపీలో వైసీపీకి మరో షాక్, పార్టీకి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు రాజీనామా
మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వైసీపీకి రాజీనామా చేశారు. తనకు పార్టీలో అంత ప్రాధాన్యత లేదని టీవీ రామారావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వైసీపీకి రాజీనామా చేశారు. 2009లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి గతంలో టీడీపీ నుంచి గెలుపొందిన ఆయన ఎమ్మెల్యేగా సేవలు అందించారు. అనంతరం వైసీపీలో చేరారు. అయితే తనకు పార్టీలో అంత ప్రాధాన్యత లేదని టీవీ రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన ఆయన తన రాజకీయ భవితవ్యం ఏంటన్నది వెల్లడించలేదు.
నిడదవోలులో జరిగిన ఓ కేసులో ఇరుక్కోవడంతో రాజకీయంగా ఆయనకు దెబ్బ తగిలింది. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయనకు 2014లో టీడీపీ నుంచి టికెట్ రాలేదు. అయినా కేఎస్ జవహర్‌కు మద్దతుగా ప్రచారం చేసి పార్టీ విజయానికి తన వంతుగా పాటు పడ్డారు టీవీ రామారావు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో చేసేదేమీ లేక తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ వైసీపీలో చేరారు. 2019లో జగన్ సమక్షంలో ఫ్యాన్ గుర్తు పార్టీ వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తానేటి వనిత (హోం మంత్రి)కు మద్దతుగా ప్రచారం చేసి ఆమె విజయంలో కీలకపాత్ర పోషించారు. అయితే పార్టీలో ప్రాధాన్యత ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వైసీపీకి గుడ్ బై చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు మీడియాతో మాట్లాడుతూ.. ఇన్ని రోజులు తనకు మద్దతుగా నిలిచిన వైసీపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పరంగా తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానన్నారు. తానేటి వనితకు మద్దతుగా పనిచేశానని చెప్పారు. కానీ పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన తనకు పదవి ఇచ్చి గౌరవించాలని పలుమార్లు కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పదవి సైతం తనకు ఏవీ ఇవ్వలేదు. అంటే పార్టీకి తనకు అవసరం లేదా, లేక పార్టీలో తనకు ప్రాధాన్యత లేదా అని భావించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
రాజీనామా చేస్తున్నానని లేనిపోని ఆరోపణలు చేయను
సాధారణంగా పార్టీ మారితే వారిమీద వీరి మీద వ్యాఖ్యలు చేస్తారని, కానీ అలాంటి పని చేయనన్నారు. పార్టీకి తాను అవసరం లేదని, అందుకే పదవులు ఇవ్వడం లేదా అని యోచించినట్లు చెప్పారు. తనకు సైతం ఆర్థికంగా అవసరాలు ఉన్నాయని, తన భార్యకు ఆపరేషన్ చేయించాల్సి ఉందని, కానీ తన ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించడం లేదని వాపోయారు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు. గత కొన్ని నెలలుగా తాను పార్టీ మారుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, అయితే తాను ఎంతగానో ఆలోచించి ఆవేదనతో వైసీపీని వీడుతున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
జనసేన నేతలతో టచ్ లో ఉన్నారని, ఆ పార్టీలో చేరుతున్నారా అని మీడియా రామారావును ప్రశ్నించింది. తాను ఏ నేతను కలవలేదని, ఒకవేళ ఎవరైనా తాను కలిసినట్లయితే ఫొటోలు బయటకు వచ్చేవి అని బదులిచ్చారు. తన మద్దతుదారులు, తనను నమ్ముకున్న వారికి కనీసం చిన్న పనులు చేయించలేకపోతున్నానని, వారికి అండగా ఉండలేకపోతున్నాననే కారణంగా అధికారపార్టీకి రాజీనామా చేసినట్లు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వివరించారు.