Tiger Fear In Agency: మన్యం ప్రాంతాలను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి-ఆసుపత్రిపాలైన యువకుడు..
Kakinada News: కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి భయం కలవరానికి గురిచేస్తోంది. పొలాలకు వళ్లి పనులు చేసుకోలేక పోతున్నామని ప్రజలు వాపోతున్నారు.
East Godavari News: కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల మన్యం పరిధిలో ప్రజలను పులి భయం పరుగులు తీయిస్తోంది. వారం రోజుల క్రితం ప్రత్తిపాడు మండలం ఏజెన్సీ ప్రాంతమైన బాపన్నధారలో పెద్దపులి ఆవుదూడపై దాడిచేసి చంపిన తరువాత భయం మరింత ఎక్కువైంది. దీంతో ప్రత్తిపాడు మండల పరిధిలోని సుమారు 10 గ్రామాల్లో ప్రజలకు బయటకు రావాలంటే జడుసుకుంటున్నారు. సాయంత్రానికే ఇంటికి చేరుకుంటున్నారు. రాత్రి వేళల్లో అడుగు బయటపెట్టడం లేదు.
తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే అడ్డతీగల మండలం కీనపర్తిలో పొలం పనులకు వెళ్లి వస్తున్న వ్యక్తికి పులి కనిపించింది. భయంతో పరుగెత్తి చివరకు ఆసుపత్రి పాలయ్యాడు. కాకినాడ, తూర్పుగోదావరితోపాటు అల్లూరి జిల్లా పరిధిలోకి వచ్చే ఏజెన్సీ ప్రాంతాలనూ పెద్దపులి భయం వెంటాడుతోంది.
పులిని చూసి ఆసుపత్రిపాలైన యువకుడు..
అడ్డతీగల మండలం కినపర్తి ప్రాంతానికి చెందిన చిన్నా అనే యువకుడు పొలం వెళ్లి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా పెద్దపులి కనిపించింది. దాన్నుంచి తప్పించుకుని పరుగుపెట్టి జనావాసాలున్న ప్రాంతానికి వచ్చాడు. పెద్దపులి కనిపించిందని చెప్పి స్పృహతప్పి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని అడ్డతీగల సీఎచ్‌సీకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతంలో పులి జాడలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి ఆధారం లభించలేదని అధికారులు చెబుతున్నారు.
Also Read: దొంగనోట్ల ముఠా గుట్టురట్టు చేసిన క్యాష్ డిపాజిట్ మెషీన్, చిన్న డౌట్‌తో తేలిన స్కామ్
పొలం పనులు మానుకుంటున్న ప్రజలు..
కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండల పరిధిలో పులిసంచారంతో మన్యం ప్రాంతాల్లో ప్రజలు పొలం పనులకు వెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు. కనీసం తమ ప్రాంతానికి ఒంటరిగా రాకపోకలు సాగించలేకపోతున్నామని అన్నారు. ఏ క్షణంలో పులి వచ్చి దాడి చేస్తుందోనని భయంతో ఉన్నామని చెబుతున్నారు. తెలంగాణాలో పులి దాడితో మహిళ చనిపోయిందని, పలువురు తీవ్ర ఆసుపత్రిపాలయ్యారన్న వార్తలు తెలిసి ఇంకా భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు సాధ్యమైనంత త్వరగా అసలు పులి ఉందో లేదో తేల్చిచెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: రాజమండ్రి నుంచి ఢిల్లీకి విమాన సర్వీస్- ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు భలే ప్రయోజనం