Rajahmundry To Delhi Flight: రాజమండ్రి నుంచి ఢిల్లీకి విమాన సర్వీస్- ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు భలే ప్రయోజనం
RJY To Delhi Flights: రాజమండ్రి విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీకి విమాన సర్వీస్‌లు ప్రారంభమయ్యాయి. ఇంతవరకు హైదరబాద్, విశాఖపట్నం వెళ్లి హస్తినకు వెళ్లాల్సి వచ్చేది.
East Godavari News: పర్యాటకంగానే కాకుండా ఆధ్మాతికంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రాకపోకలు సాగించేవారు చాలా ఎక్కువే. ఇంతవరకు హైదరబాద్, చెన్నై, బెంగుళూరు నగరాలకు పరిమితమైన విమానయాన సేవలు మొన్న ముంబై, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వరకు చేరుకున్నాయి. తాజాగా రాజమహేంద్రవరం టూ ఢిల్లీకి విమానయాన సేవలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం నుంచి నేరుగా ఢిల్లీకి విమాన సర్వీసులు ప్రారంభంపై ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు.
వాటర్ క్యానెల్స్‌తో స్వాగతం..
న్యూఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం రన్‌వేపై తొలిసారిగా ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. స్వాగత కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌నాయుడు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్థానిక ఎమ్మెల్యేలు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఏపీడీ ఎస్.జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తొలిసారి వచ్చిన విమానానికి వాటర్ క్యానెల్స్‌తో సిబ్బంది స్వాగతం పలికారు. ఆ తరువాత విమానం రాజమండ్రి నుంచి ఢిల్లీకు నేరుగా బయలుదేరింది.
గోదావరి ప్రజలు సంతోషం..
రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీకి ఫైట్ రావడంతో ఉభయగోదావరి జిల్లాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన గోదావరి ప్రాంతాలు చూసేందుకు దేశ వ్యాప్తంగా అనేక మంది రాజమండ్రి మీదుగా వచ్చే అవకాశాలుంటాయి. అంతే కాకుండా త్వరలోనే గోదావరి పుష్కరాలు కూడా వస్తుండడం కూడా ఢిల్లీ నుంచి రాజమండ్రికి భక్తులు తరలివచ్చేందుకు ఈ సర్వీసులు ఎంతో ఉపయోగపడతాయి.
ఢిల్లీలో ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థల్లో పనిచేసే వారు చాలా మంది హైదరబాద్ వెళ్లి అక్కడి నుంచి విమాన ప్రయానం చేస్తున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో పార్లమెంటు సభ్యులుగా ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఇలా అనేక మందికి ఈ ఫ్లైట్ చాలా ప్రయోజనకరం కానుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్లైట్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి?
రాజమండ్రి నుంచి ప్రతి రోజు ఒక ఫ్లైట్ ఉంటుంది. ఉదయం పదిన్నరకు రాజమండ్రిలో బయల్దేరి ఒంటిగంటకు ఢిల్లీ చేరుకుంటుంది. ఐదు వేల రూపాయలకుపైగా టికెట్ ఉంటుంది.