Konseema Floods: గోదావరి తీరంలో కృష్ణ జింకలకు కష్టకాలం - కొట్టుకుపోయి, చనిపోతున్న రాష్ట్ర జంతువు
Black Bucks in AP: ధవళేశ్వరం బ్యారేజి సమీపంలో కడియం మండలం వేమగిరి పులసల లంకలో ఉండే వందల జింకలు గత నాలుగు రోజులుగా వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
చెంగుచెంగున దూకుతూ కళ్ళకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే వన్యప్రాణుల సుందర దృశ్యాలు వరదల బీభత్సంతో హృదయ విదారక పరిస్థితులను కలగజేస్తున్నాయి. మన రాష్ట్ర జంతువు కృష్ణ జింకలకు కష్టకాలం వచ్చింది. వరద నీటి తీవ్రతకు ఇవి గల్లంతు అవుతున్నాయి. ఈ సారి వరద ఉదృతంగా రావడంతో ఇవన్నీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజి సమీపంలో కడియం మండలం వేమగిరి పులసల లంకలో ఉండే వందల జింకలు గత నాలుగు రోజులుగా వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఎత్తైన ఈ లంక కూడా ముంపునకు గురవ్వడంతో నిలవడానికి దారి లేక అవి మృత్యువాత పడ్డాయి. మరికొన్ని ఈదుకుంటూ ఒడ్డుకు చేరినప్పటికీ కుక్కల దాడిలో మృతి చెందుతున్నాయి.
మరికొన్నింటిని సజీవంగా స్థానికులు, రైతులు పట్టుకున్నప్పటికీ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోతున్నాయి. రెండు రోజుల క్రితం పొట్టి లంకలో ఒక జింక మృతి చెందగా సోమవారం కడియపు లంకలో రెండు జింకలు చనిపోయాయి. వాటిని సజీవంగా పట్టుకున్నప్పటికీ అప్పటికే కుక్కల దాడిలో గాయపడటం వల్ల మృతి చెందాయి. సంఘటన స్థలానికి కాకినాడ టెరిటోరియల్ రేంజ్ ఆఫీసర్ టీ సత్యనారాయణ, రాజమహేంద్రవరం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పద్మావతి వచ్చారు. వాటిని దివాన్ చెరువు అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళ్ళి పోష్టుమార్టం చేసి పూడ్చిపెడతామని తెలిపారు.
Also Read: KA Paul: పదేళ్లలో 9 పార్టీలు, నువ్వు రాజకీయాలకు పనికిరావు, ఇంట్లోనే ఉండు లేదంటే - కేఏ పాల్ వ్యాఖ్యలు
అవి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతాయని ఆయన వివరించారు. వాటికి హడలిపోయి ప్రాణాలు కోల్పోయే లక్షణం ఉంటుందని అందుకే అవి మృతి చెందుతుంటాయని సత్యనారాయణ తెలిపారు. అయితే గల్లంతైన జింకలు ఒడ్డున చిక్కుకుంటే రక్షించడానికి రెండు బృందాలు ఉన్నాయని అన్నారు. ఒక బృందం యానాం ప్రాంతం నుంచి బోట్‌లో వెతుకుతూ ఉంటే మరో బృందం కడియం ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట ప్రాంతంలో గాలిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో నేడు సైతం భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ జిల్లాలకు నేడు సైతం ఎల్లో అలర్ట్ జారీ అయింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. మరోవైపు గోదావరి ప్రవాహం క్రమంగా తగ్గుతోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం సమీక్షలో తెలిపారు.