AP Ministers On Pawan: శ్రీకాకుళంలో జనసేన సభ స్క్రిప్ట్, ప్యాకేజీ కోసం చంద్రబాబును పవన్ కలిశాడు: ఏపీ మంత్రులు ఫైర్
బీజేపీ తో పొత్తులో ఉండి టీడీపీ నేతలను, చంద్రబాబును పవన్ కలిసింది రేటు పెంచుకోవడానికే అని ఆరోపించారు. పవన్ ని నమ్మిన వారిని ముంచేస్తున్నాడని, జనసేనానికి డబ్బు పిచ్చి పట్టుకుందన్నారు.
కాకినాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి పరామర్శించడంపై ఏపీ మంత్రులు భగ్గుమంటున్నారు. త్వరలో శ్రీకాకుళంలో జరిగనున్న జనసేన సభ స్క్రిప్ట్ కోసం పవన్ చంద్రబాబును కలిశారని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. బీజేపీ తో పొత్తులో ఉండి టీడీపీ నేతలను, చంద్రబాబును పవన్ కలిసింది రేటు పెంచుకోవడానికే అని ఆరోపించారు. పవన్ ని నమ్మిన వారిని ముంచేస్తున్నాడని, జనసేనానికి డబ్బు పిచ్చి పట్టుకుందన్నారు. చంద్రబాబు, పవన్ కలవడంలో ఏ ఆశ్చర్యము లేదన్నారు. ఏపీలో జరగనున్న ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసే దమ్ము ఈ రెండు పార్టీలకి ఉందా? అని ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో చంద్రబాబు ను కలిశారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ మాట్లాడే ప్రతి మాటకు ఒక రేటు ఉంటుందని, నీచమైన రాజకీయాలు కు పవన్ అలవాటు పడ్డారని.. ఆయన రాజకీయ నాయకుడు కాదని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు, పవన్ భేటీని రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు: మంత్రి దాడిశెట్టి రాజా
కాకినాడ: పవన్ ఒక ప్యాకేజీ స్టార్ అని, చంద్రబాబు, పవన్ భేటీని రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు అని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. బీజేపీ తో జనసేన పొత్తులో ఉండి చంద్రబాబు చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు అని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. పవన్, చంద్రబాబు కలయిక స్వార్ధ ప్రయోజనాలు కోసం అని, టీడీపీ పరిరక్షణ కోసం అని ఎద్దేవా చేశారు. పవన్ ఒంటరిగా మిగిలిపోతాడు. రాష్ట్రంలో అన్యాయంగా 11 మంది చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు.
సమాచార మంత్రి వేణు కామెంట్స్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తన ప్రచార యావ, ఆర్బాటం వల్ల రాష్ట్రంలో 11 మంది అమాయకులు చనిపోతే ప్రతిపక్షంలో ఉండి సానుభూతి చూపని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ సమాచారశాఖ మంత్రి వేణుగోపాల్ మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని, ఈ రాష్ట్రానికి చంద్రబాబు శాపంగా మారారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. విడిపోయిన రాష్ట్రంలో తనకు అనుభవముందని అడిగితే దానికి పవన్ సపోర్ట్ చేశారని, కానీ ఓటుకు నోటు కేసుకోసం హైదరాబాద్‌ను వదిలి రాత్రికి రాత్రి వచ్చిన నేత చంద్రబాబు అని.. అప్పుడు సపోర్ట్ చేసిన పవన్ కల్యాణ్ ప్రశ్నించలేకపోయాడన్నారు.
పవన్‌కల్యాణ్ నైజం బయటపడింది
ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతారని, కానీ విలువల్లేని వ్యక్తితో అంటకాగిన పవన్ నైజం రాష్ట్ర ప్రజల ఎదుగ బయటపడిందన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీతో సహజీవనం చేస్తున్న వ్యక్తి పవన్ అన్నారు. ప్రజాస్వామ్యంలో నా పార్టీ అజెండా ఇదని చెప్పలేని దుస్థితిలో పవన్ ఉన్నారు. నీ అజెండా ఒక్కటే, చంద్రబాబు వద్ద నుంచి ప్యాకేజీ తీసుకుని ముందుకు వెళ్తున్నావు.. కానీ పేదవాడి పక్షాన నిలబడ్డ వ్యక్తి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.