TDP News: అమలాపురంలో టీడీపీ ఆచితూచి అడుగులు, ఎంపీ సీటుకు తీవ్రమైన పోటీ! తేల్చని అధిష్టానం
Andhra Pradesh News: తెలుగుదేశం పార్టీలో ఎంపీ టిక్కెట్లకు తీవ్రమైన పోటీ, అమలాపురం సీటు కోసం బాలయోగి తనయుడు హరీశ్, మాజీ ఎంపీ బుచ్చిబాబు తనయ సత్యశ్రీ పోటీ పడుతున్నారు.
TDP Amalapuram Candidate: అమలాపురం: రానున్న సార్వత్రిక ఎన్నికలు తెలుగుదేశం (Tdp) పార్టీకి చావోరేవో లాంటివి. ఖచ్చితంగా నెగ్గి తీరాల్సిందే. లేకుంటే మరో ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అది భరించే ఓపిక రెండూ చంద్రబాబు (Chandrababu)కు గానీ, ఇటు తెలుగుదేశం పార్టీకి గానీ లేవు. ఇప్పటి వరకు సీఎం జగన్( Jagan) తన పాలనను జస్ట్ ట్రైలర్ అంటున్నారంటే.. మరోసారి పదవిలోకి వచ్చారంటే అనే మాటే తెలుగుదేశం నేతల్లో గుబులు పుట్టిస్తోంది. అందుకే ప్రతి ఒక్క తెలుగు తమ్ముడూ పార్టీ గెలుపు కోసం శ్రమిస్తున్నాడు. బహుశా చంద్రబాబు వయసు రీత్యా ఇవే చివరి ఎన్నికలు కావొచ్చని పార్టీలో వినిపిస్తోంది. నారా లోకేశ్( Lokesh)కి నిరూపించుకునేందుకు ఇదే సరైన సమయం. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు పూర్తిస్థాయిలో లోకేశ్‌కు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారు. పార్టీని లోకేశ్ చేతిలో పెట్టాలంటే...అధికార పార్టీగానే పెట్టాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో విజయం తెలుగుదేశానికి తప్పనిసరిగా కనిపిస్తోంది.
ఆచితూచి ఎంపిక
అభ్యర్థుల ఎంపికే సగం విజయం సాధించినట్లు చెబుతారు పెద్దలు. ఎందుకంటే పార్టీకి ఎంత పాజిటివ్ వేవ్ ఉన్నా సరైన అభ్యర్థిని నిలబెట్టకుంటే జనం ఓట్లు వేయరు. ఖచ్చితంగా అభర్థి గుణగణాలతోపాటు రాజకీయ నేపథ్యం, సామాజిక సమీకరణం అన్నీ బేరీజు వేసుకుని అభ్యర్థులను నిలపాల్సి ఉంటుంది. వైసీపీ( Ycp) ఇప్పటికే ఆరువిడతలుగా అభ్యర్థులను ప్రకటించి జగన్ రేసులో ముందు నిలిచారు. కానీ తెలుగుదేశం నుంచి ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థికి కూడా సీటు కన్ఫార్మ్ చేయలేదంటే... ఏ మేరకు వడపోత జరుగుతోంది అర్థం చేసుకోవాలి. పైగా జనసేన(Janasena)కు ఇచ్చే సీట్ల వ్యవహారం కూడా కొలిక్కి వచ్చినట్లు లేదు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపిక చంద్రబాబుకు తీవ్ర తలనొప్పిగా మారింది. జనసేన ఎక్కువ సీట్లు కోరే జిల్లాలు ఇవే. ఇటు తెలుగుదేశానికి కూడా బాగా పట్టున్న జిల్లాలు ఇవే. జనసేనకు టిక్కెట్లు ఇచ్చిన చోట ఉన్న తెలుగుదేశం నేతలను మరోచోట సర్దుబాటు చేయాలి. వాటిని బేరీజు వేసుకునే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది..
అమలాపురం బరిలో ఎవరు..?
తెలుగుదేశంలో అధికారాల మార్పిడి చంద్రబాబు, లోకేశ్‌కే పరిమితం కాలేదు. మిగిలినచోట్ల సీనియర్లకు స్వస్తి చెప్పి పార్టీలో యువరక్తాన్ని ఎక్కించాల్సి ఉంది. అందుకే ఈసారి 40శాతం సీట్లు యువతకేనని మొదటి నుంచీ చెబుతున్నారు. దీంతో రాజకీయ వారసులు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. అమలాపురం( Amalapurm) ఎంపీ టిక్కెట్ మాజీ లోక్‌సభ స్వీకర్ దివంగత బాలయోగి తనయుడు గంటి హరీశ్ మాథుర్(Ganti Harish Mathur) మరోసారి కోరుతున్నారు. గత ఎన్నికల్లో ఇదేస్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన... ఈసారి ఎలాగైనా విజయం సాధించి తన తండ్రి అడుగుపెట్టిన పార్లమెంట్ గడప తొక్కాలని కంకణం కట్టుకున్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఎంపీ టిక్కెట్ ఇవ్వకున్నా.. అమలాపురం అసెంబ్లీ సీటు అయినా ఇవ్వాలని హరీశ్ కోరుతున్నారు. ఆయన తండ్రి బాలయోగి చేసిన సేవలు ఈ ప్రాంత ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. ఆ సానుభూతితోనే గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినా... వైసీపీ వేవ్‌తోపాటు టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి ఓటమిపాలయ్యారు. కానీ ఈసారి పరిస్థితులు అలా లేవని... ఖచ్చితంగా నెగ్గి తీరతామని ఆయన దీమా వ్యక్తం చేస్తున్నారు.
అమలాపురంలో తీవ్రమైన పోటీ
అమలాపురం టిక్కెట్ తనదేనని హరీశ్ దీమాగా ఉండగా.... కొత్త పేర్లు, అభ్యర్థులు తెరపైకి వచ్చారు. గోపవరంకు చెందిన మాజీ ఎంపీ బుచ్చిబాబు పెద్ద కుమార్తె పాము సత్యశ్రీ( Satya Sri) తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా సీనియర్ నేతలతో కలిసి చంద్రబాబును కలిసిన ఆమె... అమలాపురం లోక్‌సభ సీటు ఆశిస్తున్నారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటంబం కావడంతో ఆమె కూడా టిక్కెట్‌పై దీమాగా ఉన్నారు. మహిళా కోటాలో తన పేరు పరిశీలించే అవకాశం ఉందని ఆమె చెబుతున్నారు. ఎస్సీ రిజర్వ్‌డు స్థానాల్లోనే పోటీ ఈస్థాయిలో ఉందంటే... ఓపెన్ కేటగిరిలో టిక్కెట్లు కేటాయింపు చంద్రబాబుకు కత్తిమీద సాములాంటిదే.