Chandrababu Polavaram Visit: సీఎంగా చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం నుంచే ప్రారంభం, ఎప్పుడంటే
Andhra Pradesh CM: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు కీలక ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేయడం తెలిసిందే. తాజాగా క్షేత్రస్థాయి పర్యటనను పోలవరం ప్రాజెక్టుతో ప్రారంభించాలని నిర్ణయించారు.
Chandrababu will visit Polavaram Project | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పర్యటన ఖరారైంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును సోమవారం (జూన్ 17న) పరిశీలించనున్నారు. సీఎంగా తొలి క్షేత్రస్థాయి పర్యటనను చంద్రబాబు పోలవరం నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. ఆయన సోమవారం పోలవరం సందర్శించి ప్రాజెక్టు స్థితిని పరిశీలించనున్నారు.
ప్రతి సోమవారం పోలవరం మళ్లీ ప్రారంభం
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సోమవారం పోలవరంను ఏపీ సీఎం చంద్రబాబు పునరుద్ధరించారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ముందుగా పోలవరం ప్రాజెక్టులో జరిగిన, జరుగుతున్న పనులపై నేరుగా పరిశీలించనున్నారు. అనంతరం ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించాలని చంద్రబాబు కీలక నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరంపై అధికారులతో ఎప్పటికప్పుడూ సేకరిస్తూనే, మరోవైపు ప్రతి సోమవారం ప్రాజెక్టు అప్ డేట్‌ను తనకు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు పనులపై చంద్రబాబు ఆరా..
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా పలు శాఖల అధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పనులు, జరుగుతున్న పనుల వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. ఈ క్రమంలో జలవనరుల శాఖ అధికారులతో కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, ప్రస్తుత పరిస్థితి, జరుగుతున్న పనులపై చంద్రబాబు ఆరా తీశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం పనులను పక్కన పెట్టినట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఇకనుంచి అలా జరగడానికి వీల్లేదని, ప్రతి సోమవారం పోలవరం కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహిస్తామని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తేనే ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై అవగాహనా వస్తుందని భావించిన చంద్రబాబు జూన్ 17న పోలవరం పరిశీలనకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులకు ప్రాజెక్టు నిర్మాణం ఎలా జరుగుతుందో సైతం అవగాహనా లేదని చంద్రబాబు విమర్శించారు. సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందివ్వాలని సీఎం భావిస్తున్నారు.