మాచర్ల ఘటనపై డీజీపీ ఆరా- సమగ్ర విచారణాధికారిగా ఐజీ త్రివిక్రమ్
రాష్ట్రంలో ఏ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నించినా ఉపేక్షించబోమన్నారు డీజీపీ. మాచర్ల ఘటనపై ఐజీ త్రివిక్రమ్ పూర్తి స్థాయి విచారణ చేసి సమగ్ర నివేదిక ఇస్తారని తెలిపారు.
మాచర్లలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నించి వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. ప్రస్తుతానికి అక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ... పూర్తి స్థాయి విచారణ చేస్తున్నట్టు వెల్లడించారు. పూర్తి స్థాయి విచారరణకు ఐజీ త్రివిక్రమ్‌ను మాచర్ల పంపించారు.
మాచర్ల ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది పోలీసుశాఖ. ఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అది ఫ్యాక్షన్ చర్యగా అభివర్ణించారు. ఇప్పుడు ఇదే ఘటనపై డీజీపీ స్పందించారు. నిందితులను ఎవరున్నా సరే వదిలే ప్రసక్తి లేదన్నారు.
రాష్ట్రంలో ఏ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నించినా ఉపేక్షించబోమన్నారు డీజీపీ. మాచర్ల ఘటనపై ఐజీ త్రివిక్రమ్ పూర్తి స్థాయి విచారణ చేసి సమగ్ర నివేదిక ఇస్తారని తెలిపారు. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉందని.... అదనపు బలగాలు అక్కడ మోహరించినట్టు డీజీపీ వెల్లడించారు.
మాచర్ల పట్టణంలో శుక్రవారం సాయంత్రం టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడులకు పాల్పడ్డారు. టీడీపీ ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు స్థానిక రింగురోడ్డు వద్ద ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్యాలయం వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. చిన్న కాన్వెంట్ సమీపంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఇరు పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు, సీసాలు విసురుకుని దాడులకు పాల్పడ్డారు. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులకు దిగాయి. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రదర్శన నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని టీడీపీ నేతలకు పోలీసులు సూచించారు. మాచర్ల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. మాచర్ల పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారిని స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బ్రహ్మారెడ్డి ఇంటికి నిప్పు పెట్టిన అల్లరి మూకలు
మాచర్లలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేత బ్రహ్మారెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు. టీడీపీ కార్యకర్త ఇంటిని ధ్వంసం చేశారు. అల్లరి మూకలను పోలీసులు అడ్డుకుంటున్నాారు. టీడీపీ నేతల వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు బ్రహ్మారెడ్డిపై లాఠీ ఎత్తడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వైసీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు.
ఇది వైసీపీ నాయకుల పనే అంటూ టీడీపీ విమర్శిస్తుంటే... ఇది టీడీ చేసిన కుట్రగా అధికార పార్టీ ఆరోపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల వాళ్లు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.