CM Chandrababu: కార్యకర్తకు సీఎం చంద్రబాబు సర్‌ప్రైజ్, వీడియో కాల్ చేసి మరీ అండగా ఉంటానని భరోసా
Andhra Pradesh News | ఏపీ సీఎం చంద్రబాబు క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ కార్యకర్తకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. వీడియో కాల్ చేసి మరీ పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అమరావతి: గత ఎన్నికల్లో అఖండ విజయం అందించిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) పలుమార్లు అన్నారు. మహానాడులోనూ చేసిన తీర్మానాల్లో కార్యకర్తే అధిపతి అంటూ తెలుగుదేశం పార్టీకి వారి ప్రాముఖ్యతను చాటిచెప్పారు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కార్యకర్త టీడీపీ అధినేత చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని కోరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆ కార్యకర్తకు వీడియో కాల్ చేసి మరీ మాట్లాడారు. కార్యకర్తతో మాట్లాడి ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు, హాస్పిటల్ బిల్లులు సైతం చెల్లిస్తామని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
అభిమానికి చంద్రబాబు వీడియో కాల్
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ టీడీపీకి వీరాభిమాని. టీడీపీ కార్యకర్త అయిన ఆకుల కృష్ణకు సీఎం చంద్రబాబు అంటే ఇష్టం. ఆయన ఇటీవల క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. తన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని కార్యకర్త ఆకుల కృష్ణ కోరుకున్నారు. ఈ విషయం తెలియడంతో సీఎం చంద్రబాబు శనివారం నాడు స్వయంగా ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి పరామర్శించారు.
బిల్లులు చెల్లిస్తామని కార్యకర్త ఫ్యామిలీకి భరోసా..
అభిమాని ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్న చంద్రబాబు కార్యకర్త కుటుంబసభ్యులతోనూ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంచివాళ్లకు కష్టాలు వస్తాయని, ధైర్యంగా ఉండాలని.. పార్టీ తరఫున అన్ని విధాలా తాను అండగా ఉంటానని ఆకుల కృష్ణకు, ఆయన కుటుంబానికి చంద్రబాబు భరోసా ఇచ్చారు. బిల్లులు ఏమైనా ఉంటే పంపించాలని, వాటిని చెల్లిస్తామని చంద్రబాబు చెప్పడంతో కార్యకర్త కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
పార్టీ విజయం కోసం నిస్వార్థంగా పనిచేసేది కార్యకర్తలేనని, వారి త్యాగాలు, పోరాటాలతోనే ఏపీలో తాము ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చామని సీఎం చంద్రబాబు, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పలుమార్లు ప్రస్తావించారు. మహానాడులో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కార్యకర్తకు సమస్య రాకుండా చూసుకుంటామని, అదే తెలుగుదేశం పార్టీ విధానమన్నారు.






















