Mudragada Padmanabha Reddy: ఇకపై ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి- అధికారిక ప్రకటన విడుదల
Mudragada Padmanabha Reddy: ముద్రగడ పేరు మారిపోయింది. ఆయనపై ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పిలవాలని అధికారిక ఉత్తర్వులు వచ్చాయి.
Mudragada Padmanabha Reddy: ముద్రగడ పద్మనాభం పేరు ఇకపై ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయింది. ఆయన పేరు మార్పుపై అధికారిక ప్రకటన వెలువడింది. ఇకపై ఆయన్ని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పిలవాలని అందులో పేర్కొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి గెలవడంతో ముద్రగడ తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు గెజిట్ విడుదల చేశారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, ఎన్డీఏ కూటమి హోరాహోరీగా తలపడ్డాయి. నేతల మధ్య మాట యుద్ధం సాగింది. ఈ క్రమంలోనే పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఓడిపోతారని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈసారి కూడా ప్రజలు తిరస్కరిస్తారని అప్పట్లో జోస్యం చెప్పారు.
ఆ విమర్శలతో ఆగిపోని ముద్రగడ... పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలిస్తే తన పేరు మార్చుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు. పవన్ గెలిస్తే మాత్రం తన పేరు అప్పటి నుంచి పద్మనాభ రెడ్డిగా పిలవాలని అన్నారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది.
సీన్ కట్ చేస్తే ఫలితాల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసింది. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. పవన్ లీడింగ్‌లో ఉన్నప్పటి నుంచి ముద్రగడపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు జనసైనికులు. పద్మనాభ రెడ్డి నామకరణ మహోత్సవం అంటూ విమర్శలు చేశారు.
ఫలితాలు వచ్చిన మరుసటి రోజు ప్రెస్‌మీట్ పెట్టిన ముద్రగడ చేసిన ఛాలెంజ్ ప్రకారం తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ కూడా స్టార్ట్ చేసినట్టు వెల్లడించారు. ఈ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత బుధవారం ముద్రగడ పద్మనాభం పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తున్నట్టు గెజిట్ విడుదలైంది.
ముద్రగడ పద్మనాభం ఎన్నికల వరకు న్యూట్రల్‌గా ఏ పార్టీకీ చెందని వ్యక్తిగా ఉంటూ టీడీపీ, జనసేనపై విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే ఆయన జనసేనలో చేరుతున్నట్టు ఎన్నికల ముందు చాలా వార్తలు వచ్చాయి. పవన్ కల్యాణ్ ఆయన్ని ఆహ్వానించడానికి ఇంటికి కూడా వెళ్తారని అప్పట్లో టాక్ వినిపించింది. ఇంతలో ఏమైందో తెలియదు కానీ ముద్రగడ వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటన చేశారు. ఇది ఆయన అభిమానులతోపాటు చాలా మందిని ఆశ్చర్యం కలిగించింది.
కాపు ఉద్యమ నేతగా పేరు ఉన్న ముద్రగడ 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. తమకు ఇవ్వాల్సిన నిధులు, బీసీల్లో చేరుస్తామన్న హామీ నెరవేర్చాలని నినదించారు. ఈ క్రమంలోనే తునిలో భారీ బహిరంగ సభ పెట్టారు. ఆ సభ జరుగుతున్న క్రమంలోనే ఆందోళనకారులు రైలును తగలబెట్టేశారు. అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసుల్లో నేటికీ చాలా మంది కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. అప్పట్లో ఆ స్థాయి పోరాటాలు చేసిన వ్యక్తి వైసీపీ అధికారంలోకి రావడంతోనే సైలెంట్ అయిపోవడం ఆయనతోపాటు కాపుసామాజిక వర్గం వారికి అర్థం కాలేదు. తర్వాత ఆయన వైసీపీ చేరి విమర్శలు పాలయ్యారు.