Nadendla Manohar : మచిలీపట్నంలో జనసేన సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర, నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Nadendla Manohar : జనసేన ఆవిర్భావసభకు స్థలం ఇచ్చినందుకు ప్రభుత్వం ఇప్పటం గ్రామస్థులను వేధిస్తుందని నాందెడ్ల మనోహర్ ఆరోపించారు. ఇప్పటంలో నిర్మాణాల కూల్చివేతను తప్పుబట్టారు.
Nadendla Manohar : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో.... జన సైనికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా చెక్కులు పంపిణీ చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... వివిధ ప్రమాదాలలో చనిపోయిన 11 మంది జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు చెక్కుల పంపిణీ చేశామన్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో కూల్చివేతలపై స్పందిస్తూ... ప్రశాంతమైన ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందన్నారు. శనివారం ఉదయం నుంచి జనసేన నేతలను అరెస్టులు చేస్తున్నారని, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జనసేన 10వ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందుకు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. మచిలీపట్నంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవ అడ్డుకోవడానికి ప్రభుత్వం కుట్రతో వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించి మంచి కార్యక్రమాలు అడ్డుకుంటుందని విమర్శించారు. ఇప్పటంలో అరెస్ట్ అయిన 20 మంది జనసేన నేతలను తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు ఆందోళన చేస్తారని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. జనసేన అజెండా ప్రకారమే ముందుకెళ్తుందన్నారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను నియమిస్తామన్నారు.
ఇప్పటంలో ఇళ్లు కూల్చి వైసీపీ పైశాచికానందం పొందుతోంది
— JanaSena Party (@JanaSenaParty) March 4, 2023
Link: https://t.co/9VlxxKkfWL pic.twitter.com/I6vtxHNnw8
ఇప్పటం గ్రామంలో విధ్వంసం
"పవన్ కల్యాణ్ గొప్ప ఆలోచనతో జనసైనికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు క్రియాశీలక సభ్యత్వం పొందిన వారికి రూ.5 లక్షలు అందిస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికులు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. నిన్న పశ్చిమగోదావరి జిల్లాలో రూ.30 లక్షలు అందించాం. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో రూ.35 లక్షలు ఆర్థిక సాయం చేశాం. జనసైనికులకు పార్టీ అండగా నిలుస్తుంది. ఇప్పటం గ్రామంలో ఉదయం నుంచి విధ్వంసం సృష్టిస్తున్నారు. అధికార యాంత్రాంగం అన్యాయంగా కూల్చివేతలు చేస్తుంది. జనసేన సభకు స్థలం ఇచ్చారన్న కక్షతో ఇళ్లు కూలుస్తున్నారు. నాలుగు వేల జనాభా ఉన్న గ్రామంలో 80 అడుగుల రోడ్డు వేస్తామని చెప్తున్నారు. జనసేన పార్టీకి మద్దతుగా నిలిచారని వాళ్లను టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి తన అధికారంతో ఇప్పటం గ్రామంలో చిచ్చుపెట్టారు. గ్రామస్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న జనసైనికులను అరెస్టు చేశారు. వాళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జనసైనికులను విడుదల చేయగా పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతాం." -నాదెండ్ల మనోహర్
కుట్రపూరితంగా కూల్చివేతలు
ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేస్తూ వైసీపీ ప్రభుత్వం పైశానిక ఆనందం పొందుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. మచిలీపట్నంలో జరిగే ఆవిర్భావ సభకు భూములు ఇచ్చిన రైతుల్ని భయపెట్టేందుకే ప్రభుత్వం మరోసారి ఇప్పటంలో కుట్రపూరితంగా కూల్చివేతలు మొదలుపెట్టిందన్నారు. ఇప్పటంలో ఇళ్లు కూల్చే కార్యక్రమాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. వారాంతాల్లో కూల్చివేతలు కచ్చితంగా కక్ష సాధింపు చర్యేనన్నారు. బాధితులు కోర్టును ఆశ్రయించే అవకాశం లేకుండా ఈ విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో రెండు రోజుల పాటు రాజకీయ విమర్శలు చేయబోమన్న పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని ఆసరాగా చేసుకుని ఉదయం ఆరు గంటల నుంచే ఇప్పటం గ్రామం మీద పడ్డారని మండిపడ్డారు. సీఎం జగన్ నిజంగా సైకో సీఎం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో జరిగే 10వ ఆవిర్భావ సభ విజయం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని పిలుపునిచ్చారు.