(Source: ECI/ABP News/ABP Majha)
Kollu Ravindra : గన్నవరం ఘటన సజ్జల స్కెచ్, ముఖ్యమంత్రే దాడులను ప్రోత్సహిస్తున్నారు- కొల్లు రవీంద్ర
Kollu Ravindra : రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ నేతలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.
Kollu Ravindra : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ నేత పట్టాభిరామ్ తో పాటు పలువు నేతలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... 11 మందిపై 307, 333తో పాటు అనేక కేసులు పెట్టి అరెస్టు చేసి సెంట్రల్ జైలుకి తీసుకువచ్చారని మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని పరామర్శించడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చాన్నారు. అరెస్టులు చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. ఇదంతా సీఎం జగన్ మోహనరెడ్డి ఆదేశాలతో ఇవన్నీ జరిగాయన్నారు. ఈ ఘటనకు స్కెచ్ వేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆరోపించారు. బచ్చుల అర్జునుడు ఇన్ ఛార్జ్ గా ఉండి ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటే దాడి చేసి కార్లు తగలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వెళ్లిన యువకులపై కూడా అక్రమ కేసులు పెట్టారన్నారు. దాడులను, క్రైమ్ ను ప్రోత్సహిస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సీఐడీ చీఫ్ గా పనిచేసిన సునీల్ కుమార్ సీఎం జగన్ చెప్పినట్లుగా ఎంపీ రఘురామకృష్ణ పై థర్డ్ డిగ్రీ ప్రదర్శించారని, కేంద్ర హోంశాఖ నుంచి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోమని స్టేట్మెంట్ కూడా వచ్చిందన్నారు. వైసీపీ రాళ్ల దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్లపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు.
పట్టాభికి 14 రోజుల రిమాండ్
గన్నవరం ఘటనలో టీడీపీ నేతలకు స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పట్టాభిరామ్ సహా 15 మంది టీడీపీ నేతలకు 14 రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. చికిత్స అనంతరం పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‍లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పట్టాభి ఆరోపించారు. ముగ్గురు వ్యక్తులు ముసుగుతో వచ్చి అరగంటసేపు కొట్టారన్నారు. వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారన్నారు. తోట్లవల్లూరు స్టేషన్‍కు వెళ్లేసరికి అంతా చీకటిగా ఉందని, అక్కడ తనపై దాడి చేశారని ఆరోపించారు. వివిధ స్టేషన్లకు తిప్పుతూ తనను చిత్రహింసలు పెట్టారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు ఉన్న కోర్టు పట్టాభికి చికిత్స అందించాలని ఆదేశించింది. అంతకు ముందు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పట్టాభిరామ్ గన్నవరం బయలుదేరారు. మార్గమధ్యలో పట్టాభిని పోలీసులు అరెస్టుచేశారు. ఆ సమయంలోనే వైసీపీ కార్యకర్తలు ఆయనపై దాడికి దిగారు. పట్టాభి కారును ధ్వంసం చేశారు. అనంతరం ఆయనను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆయన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశారు. తన భర్త ఎక్కడున్నారో చెప్పాలని పట్టాభి భార్య చందన ఆందోళన దిగారు. ఈ పరిణామాల అనంతరం గన్నవరం కోర్టులో పట్టాభిని పోలీసులు హాజరుపర్చారు. పట్టాభిని చిత్రహింసలు పెట్టారని ఆయన సతీమణి చందన ఆరోపించారు.
జగన్ నియంత పోకడలు
రాజకీయ అవసరాల కోసం పోలీసు వ్యవస్థను, అధికారులను జగన్ మోహన్ రెడ్డి వాడుకుంటున్నారని ఆరోపించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. అందుకే ఏపీలో ప్రభుత్వ అరాచక, విధ్వంసకర పాలనలో ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గన్నవరంలో జరిగిన ఘటనపై ఇటీవల బహిరంగ లేఖ రాసిన ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారాయని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే... ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు, కేసులు, హింసాత్మక ఘటనలు, పోలీసు టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గన్నవరం విధ్వంసం ఒక తాజా ఉదాహరణఅని చెప్పుకొచ్చారు. గన్నవరం ఘటనలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై, పార్టీ నేతల ఇళ్లపై, కార్యకర్తలపై దాడులు చేయడం దారుణం అన్నారు. ఆ బాధితులనే నిందితులుగా మార్చి జైలుకు పంపిన వైనంపై వాస్తవాలును ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు.