Weather Latest Update: ఏపీ, తెలంగాణలో వర్షాలతో పలు జిల్లాలకు ఎల్లో వార్నింగ్ - కొన్నిచోట్ల ఉక్కపోతతో పాట్లు
Rains in Andhra Pradesh | ఏపీలో రాయలసీమలో వర్షాలు కురవనుండగా, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉక్కపోత వాతావరణంతో ఇబ్బందులు పడతారు. హైదరాబాద్ లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
Telangana Rains News Updates | అరేబియా సముద్రంలో ఒక ఉపరితల ద్రోణి, బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తమిళనాడు నుంచి లక్షద్వీప్, అరేబియా సముద్రం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కేరళ మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ దిశ వైపు గాలులు వీచనున్నాయి.
ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మరో ఒకట్రెండు రోజులు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతవరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల ఉక్కపోత ఉంటే, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేశారు. రాయలసీమ జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారనుంది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వేడిగాలులు వీచనున్నాయి. చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు పడనుండగా, కొన్నిచోట్ల తేలికపాటి జల్లులకు అవకాశం ఉంది. ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది.
District forecast of Andhra Pradesh dated 08-10-2024 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/rnWHdZzrD5
— MC Amaravati (@AmaravatiMc) October 8, 2024
తెలంగాణలో వెదర్ అప్‌డేట్స్
తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్న కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. బుధవారం నాడు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ జారీ చేశారు.
బుధవారం సాయంత్రం తరువాత కొన్ని జిల్లాలకు వర్ష సూచన ఉంది. గురువారం ఉదయం వరకు మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :08-10-2024 pic.twitter.com/fu1dLPKe7i
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 8, 2024
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో ఉరుములతో కూడిన వర్షం, లేక తేలికపాటి వర్షం కురవనుంది. కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలుగా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీచే అవకాశం ఉంది.
Also Read: Nagarjuna News: కొండా సురేఖకు క్రిమినల్ పరువునష్టం దావా నోటీసులు ఇచ్చేది ఎప్పుడంటే!