Prakasam News: ప్రకాశం జిల్లా వైసీపీలో చిచ్చు రేపిన మార్కాపురం సీటు వ్యవహారం, అనుచరులతో జంకె వెంకటరెడ్డి భేటీ
YSRCP News: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీలో టికెట్ల వివాదం రాజుకుంటోంది. హైకమాండ్ తమను కాదని మరొకరిని అభ్యర్థులుగా ఖరారు చేయడంతో రగిలిపోతున్నారు.
Ticket Fight In Prakasam YSRCP : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh Assembly)లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ (YSRCP)లో టికెట్ల వివాదం రాజుకుంటోంది. హైకమాండ్ తమను కాదని మరొకరిని అభ్యర్థులుగా ఖరారు చేయడంతో రగిలిపోతున్నారు. ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడితే, ఇంకొకరికి సీటు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ నిర్వహిస్తున్న సాధికార బస్సు యాత్ర ప్రకాశం (Prakasam District) జిల్లాలో పార్టీలో చిచ్చురేపింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకట రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు.
మార్కాపురం సీటు ఆశిస్తున్నా వెంకటరెడ్డి
ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జంకె వెంకటరెడ్డి, వైసీపీ తరపున మార్కాపురం అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు. తనను కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున గెలిపించుకోవాలని విజయసాయిరెడ్డి చెప్పడంపై రగిలిపోతున్నారు. మార్కాపురం టికెట్ ఆశిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి సైతం కనిగిరి పర్యటనకు దూరంగా ఉన్నారు. మరోసారి నాగార్జునరెడ్డికి మార్కాపురం అసెంబ్లీ సీటు కేటాయించడాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకట రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు తన అనుచరులతో సమావేశమయ్యారు. స్థానిక నేతలతో సంప్రదించకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని గెలిపించాలని ఎలా చెబుతారని విజయసాయిరెడ్డిపై అసమ్మతి నేతలు మండిపడ్డారు. జంకె వెంకటరెడ్డితో స్థానిక నేతలు వెన్నా హనుమారెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డితో పాటు మరికొందరు ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చిస్తున్నారు జంకె వెంకటరెడ్డి.
తమకు మాటైన చెప్పరా అంటోన్న బాలినేని
మార్కాపురంలో వైసీపీ సాధికార బస్సు యాత్రకు ఎంపీ విజయసాయిరెడ్డి, బాలినేని కలిసి ఒకే కారులో వెళ్లారు. శామ్యూల్ జార్జి కళాశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పోటీచేస్తారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. నాగార్జున రెడ్డిని గెలిపించుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. రోజంతా కలిసే ఉన్నా తమకు చెప్పకుండా ఏకపక్షంగా నాగార్జునరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జంకె వెంకటరెడ్డి ఆగ్రహంతో ఉన్నారు.
హైకమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు రెడీ
మరోవైపు ఇదే మార్కాపురం సీటు వ్యవహారంపై పార్టీ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు. రోజంతా కలిసే ఉన్నా తమకు ఒక్క మాటైన చెప్పకపోవడం, ఏకపక్షంగా నాగార్జునరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఇతర నేతలు చిన్నబుచ్చుకున్నారు. ఆ తర్వాత కనిగిరి సభకు వెళ్లేముందు ఎంపీ విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో బాలినేని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒంగోలులో ఇటీవల నిర్వహించిన సమీక్షల్లో జిల్లా బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారని, ఇప్పుడు ఏమీ చెప్పకుండా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. నాగార్జునరెడ్డికి అసెంబ్లీ సీటు కేటాయించడంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డితోపాటు జంకె వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారంటూ సొంత పార్టీ నేతలతోనే వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి వ్యవహారశైలిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.