Polavaram Project Update: పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం...జల విద్యుత్ కేంద్రం ప్రెజర్ టన్నెల్ పనులకు శ్రీకారం
పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన జల విద్యుత్ కేంద్రం ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు ఇవాళ ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టులో మరో కీలకఘట్టం మొదలైంది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులు వేగం పుంజుకున్నాయి. అనుకున్న సమయానికే ప్రాజెక్ట్ పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో, ప్రాజెక్టు ఫలితాలను రాష్ట్ర ప్రజలకు అందించేందుకు అడుగులేస్తోంది ప్రభుత్వం.
ప్రతి ఏడాది గోదావరి నది నుంచి మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలుస్తోంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగించే నీటి కన్నా చాలా రేట్లు ఎక్కువ. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే ఏపీ అభివృద్ధికి ఎంతో కీలకమవుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ తో పాటు జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే 194 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. ఇందులో 120 టీఎంసీల నీటిని జల విద్యుత్ ఉత్పత్తి, సాగు నీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగిలిన 70టీఎంసీలను నిల్వ చేస్తారు. ఈ 120 టీఎంసీల నీటిని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు.
పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 10.5 లక్షల ఎకరాల భూమి సాగు అవుతుంది. గోదావరి నీటిని నిల్వ చేసే అవకాశాలు ఆంధ్రప్రదేశ్‌లో ఒక పోలవరం ప్రాజెక్ట్ వద్ద తప్ప మరెక్కడా అనువుగా లేదు. సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద నిల్వ అవకాశాలు ఉన్నా అది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో పోలవరం వద్ద నీటిని నిల్వ చేయడం వల్ల అధిక ప్రయోజనాలు ఉన్నాయి. గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా భారీ జల విద్యుత్ కేంద్రాలు లేవు. ఉన్న ఒకటి, రెండు కూడా చాలా తక్కువ సామర్ధ్యంతో ఉన్నాయి. పోలవరంలో ఉత్పత్తి చేసే విద్యుత్ వల్ల రాష్ట్రం మిగులు విద్యుత్ సాధించే అవకాశం ఉంటుంది. మిగులు విద్యుత్ కారణంగా నూతన పరిశ్రమలు వచ్చే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయానికి కూడా ఈ విద్యుత్ చాలా కీలకంకానుంది.
జలవిద్యుత్ కేంద్రం ప్రత్యేకత
పోలవరం జలవిద్యుత్ కేంద్రాన్ని 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇందులో 12 వెర్టికల్ కెప్లాన్ టర్బైన్లు ఉంటాయి. ఒక్కో టర్బైన్ 80 మెగావాట్ల కెపాసిటీ ఉంటుంది. వీటిని భోపాల్‌కు చెందిన బీహెచ్ఈఎల్ సంస్థ రూపొందించింది. ఇవి ఆసియాలోనే అతిపెద్దవి. వీటికి సంబంధించి ఇప్పటికే మోడల్ టెస్టింగ్ కూడా పూర్తైంది. వీటి కోసం 12 ప్రెజర్ టన్నెల్స్ తవ్వాల్సి ఉంటుంది. వీటికి 12 జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్లు ఉంటాయి. ఒక్కోటి 100 మెగావాట్లు సామర్థ్యంతో ఉంటాయి. పవర్ ప్రాజెక్టు కోసం 206 మీటర్లు పొడవున అప్రోచ్ ఛానెల్, 294 మీటర్ల వెడల్పు తవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించి డ్రాయింగ్స్, మోడల్స్ రూపొందించే పనులు సైతం పూర్తవుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రం పనులు ఇప్పటికే శరవేగంగా నడుస్తున్నాయి. అందులో భాగంగానే అత్యంత కీలకమైన ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు జెన్కో అధికారులు. కీలకమైన జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ రివర్స్ టెండరింగ్ అనంతరం ఈ ఏడాది మార్చి 30వ తేదీ నుంచి పనులు ప్రారంభించింది. ఇప్పటికే 18.90 లక్షల క్యూబిక్ మీటర్ల కొండ తవ్వకం పనులను పూర్తి చేసింది. పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను జలవనరుల శాఖ తవ్వకం పర్యవేక్షిస్తుండగా, కీలకమైన ప్రెజర్వ్ టన్నెల్స్ తవ్వకం పనులు, జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించిన అన్ని పనులను జెన్కో అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో జెన్ కో ఎస్ఈ ఎస్.శేషారెడ్డి, ఈఈలు ఎ.సోమయ్య, సి.హనుమ, ఎలక్ట్రికల్ ఈఈ వై.భీమధనరావు, జలవనరుల శాఖ ఈఈ పాండురంగారావు, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎం ముద్దు కృష్ణ ఇతర సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించి టన్నెల్స్ తవ్వకం పనులు ప్రారంభించారు.