Pattiseema Pipeline: పగిలిన పట్టిసీమ పైప్ లైన్ - 20 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన నీళ్లు, పంటలు మునుగుతున్నాయని రైతుల ఆందోళన
Andhrapradesh News: ఏలూరు జిల్లా పోలవరం విక్కిసిరావుపేట వద్ద పట్టిసీమ పైప్ లైన్ పగిలి భారీగా నీరు ఎగిసి పడుతోంది. గోదావరి జలాలు వృథాగా పోతుండగా.. తమ పొలాలు మునుగుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Pattiseema Pipeline Burst In Eluru: ఏలూరు జిల్లా పోలవరం (Polavaram) మండలం విక్కిసిరావుపేట వద్ద శుక్రవారం ఉదయం పట్టిసీమ (Pattiseema) పైప్ లైన్ పగిలిపోయింది. ఎయిర్ వాల్ లీక్ అయిన ఘటనలో 20 అడుగులు ఎత్తులో నీళ్లు ఎగిసిపడుతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి పైప్ లైన్ ద్వారా కుడి కాల్వలోకి నీళ్లు వెళ్లే మార్గంలో పైప్ లైన్ ధ్వంసమైంది. ఈ క్రమంలో గోదావరి జలాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. గోదావరి నది నుంచి పోలవరం కుడి కాల్వ వరకు డెలివరీ ఛానల్ ఏర్పాటు చేశారు. భారీ మోటర్లతో నీటి పైకి తోడి వాటిని పైప్‌లైన్ల ద్వారా డెలివరీ ఛానల్‌కు మళ్లిస్తారు. గోదావరి నది నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో కుడి కాల్వ వద్ద ఛానల్ ప్రారంభం అవుతుంది.
అదే కారణమా.!
పైప్ లైన్లలోని ఒకదానిలో ఒత్తిడి పెరిగి వాల్వులు పగిలిపోయాయి. గత ఐదేళ్లుగా పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్ నిర్వహణను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మొదటి నాలుగేళ్లు మోటార్లను పూర్తిగా పక్కన పెట్టేశారు. గత ఏడాది నీటి కొరతతో వాటిని కొద్ది రోజులు వినియోగించారు. ఈ ఏడాది ప్రాజెక్టుల్లో నీరు పూర్తిగా ఎండిపోవడంతో పట్టిసీమ మోటార్లతో నీటి తరలింపు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం మంత్రి నిమ్మల రామానాయుడు వీటిని ప్రారంభించారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటిని లిఫ్ట్ చేయడం లేదు. దశల వారీగా మోటర్ల సామర్ధ్యం పెంచుకుంటూ వెళ్లాలని ప్రణాళిక రూపొందించారు. అయితే పైప్‌లైన్ ధ్వంసం కావడంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది.
ఆందోళనలో రైతులు
పైప్ లైన్ లీకేజీతో తమ పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నీటి లీకేజీ అరికట్టాలని కోరుతున్నారు. మరోవైపు పైప్‌లైన్ పగిలిపోయిన ప్రాంతానికి వెళ్లే మార్గం కూడా మూసుకుపోయింది. చెట్లు, పొదలతో నిండిపోయిన ప్రాంతానికి చేరాలంటే జంగిల్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోటార్లను నిలుపుదల చేస్తే తప్ప ఏ లైన్ పగిలిందో గుర్తించలేని పరిస్థితి ఉంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు పైప్‌లైన్లలో ఏ మేరకు నష్టం జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు. అటు, ఈ ఘటనపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఎయిర్ వాల్ లీకేజీని అరికట్టాలని పట్టిసీమ ఎస్ఈని ఆదేశించారు.